తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అప్పుడేనా..?

KTR Interview Telangana Goes to Polls in 2023. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ప్లీనరీకి ముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 April 2022 1:30 PM GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అప్పుడేనా..?

తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ప్లీనరీకి ముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు తమ ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తిగా పాలిస్తుందని వెల్లడించారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఆలోచనలను తోసిపుచ్చారు. జర్నలిస్టుల బృందంతో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పరిస్థితులు, తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాల గురించి తన మనసులోని మాటను బయటపెట్టారు.

ప్రశ్న: ఐ-పీఏసీతో భేటీ నిర్ణయం వెనుక బీజేపీ ఎదుగుతోందనేనా? కాంగ్రెస్‌ను కూడా సంప్రదించారా?

కెటిఆర్: బీజేపీ ఎదుగుదలకు కారణం.. ముఖ్యంగా డిజిటల్ మీడియాలో జరుగుతున్న చర్చలే. ద్రవ్యోల్బణం పెరుగుదల తప్ప బీజేపీలో ఎటువంటి పెరుగుదల కనిపించడం లేదు. ద్రవ్యోల్బణం 40 ఏళ్లలో అత్యధికంగా ఉంది. నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. 2014లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించారు. అయితే, నేడు ఇన్‌పుట్ ఖర్చు రెండింతలు పెరిగింది. బీజేపీకి విఫలమైనా.. కాంగ్రెస్ వల్లే నెగ్గుకురాబోతున్నారు. సమస్యలను కాంగ్రెస్ కేంద్రం దృష్టికి తీసుకురాలేకపోవడం బీజేపీని తప్పుపట్టకుండా చేస్తోంది. మమత, స్టాలిన్ లాంటి బలమైన నాయకులు ఉన్న చోట బీజేపీకి చెక్ పెట్టారు. కాంగ్రెస్‌ ఎక్కడ పోటీ చేసినా బీజేపీ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. కాంగ్రెస్ చేస్తున్న పని నాకు కనిపించడం లేదు. నాకు ఎక్కడా కాంగ్రెస్ కనిపించడం లేదు. రాహుల్ గాంధీ తన సీటును గెలవలేకపోయాడు, అతను దేశాన్ని ఎలా గెలుస్తాడు.

ప్రశ్న: అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు కేంద్ర బిందువుగా ఉన్నారు. మీరు ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు మాత్రమే జాతీయ రాజకీయాల గురించి మాట్లాడతారు. జాతీయ రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడబోతున్నారు?

కేటీఆర్: మీడియాకు కేజ్రీవాల్ హిందీ హార్ట్ ల్యాండ్ నుంచి వచ్చినందు వలన పెద్ద నాయకుడిగా కనిపిస్తున్నారు. ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనకు సాగునీటి సమస్య లేదు, రెవెన్యూ సమస్యలు కూడా లేవు. పంజాబ్‌లో ఆప్ సామర్థ్యాన్ని పరీక్షించనున్నారు. గుర్గావ్, నోయిడా లేదా ఢిల్లీలో ఏం జరుగుతుందోనని మీడియా ఫిక్స్ అయిపోయింది. ఇతర ప్రాంతాల్లో కూడా మంచి పనులు జరుగుతున్నాయనేది పట్టించుకోవడం లేదు. నిజాయితీగా వార్తలను నివేదిస్తే కేసీఆర్ లాంటి నాయకులు నిలబడతారు. అందుకు సమయం కూడా ఉంటుంది.

ఇది ప్రాంతీయ పార్టీల యుగం. బీజేపీ పెద్ద ప్రాంతీయ పార్టీ, కాంగ్రెస్ కొంచెం చిన్నది, మనం దానికంటే చిన్నవాళ్ళం. కర్ణాటక మినహా దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎక్కడ ఉంది? తెలంగాణలో 4 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. దక్షిణ భారతదేశంలో ఎక్కడా తమ ప్రదర్శనలో నిలకడగా లేరు. జాతీయ పార్టీ అని చెప్పుకునే బీజేపీ కేవలం ప్రాంతీయ పార్టీ. జాతీయ స్థాయికి ఎప్పుడు వెళ్తామని మీరు అడుగుతున్నారు.. తమిళనాడు, కేరళ, తెలంగాణల్లో బీజేపీ ఎప్పుడు వస్తుందని నేను అడుగుతున్నాను.

ప్రశ్న: అధికార వ్యతిరేకత, ఖమ్మం, రామయంపేట ఘటనలు మీ అవకాశాలను దెబ్బతీస్తాయా?

కెటిఆర్: అధికార వ్యతిరేకత చాలా సహజం. తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలున్నారు. వారు అధికార వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటారు. వారి నియోజక వర్గాల్లో ఏం పని చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. వారికి ఏ ప్రత్యేక ప్రాజెక్టులు వచ్చాయి? ఉదాహరణకు నిజామాబాద్‌లో ఐదు రోజుల్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ అది జరగడాన్ని మనం చూడలేకపోతున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వల్ల రాష్ట్రానికి ఏం వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు మాత్రమే కరీంనగర్‌లో అమలవుతున్నాయి. అధికార వ్యతిరేకత ఒక్క పార్టీకి మాత్రమే కాదు. ప్రతి పార్టీ ఎదుర్కోవాలి.

ఖమ్మం, రామాయంపేటలో జరిగిన సమస్యలు దురదృష్టకరం. ఈ సమస్యలపై పార్టీ ఎలా స్పందిస్తుందన్నదే ప్రశ్న. లఖింపూర్ ఖేరీలో ఆశిష్ మిశ్రా రైతులను చంపేశారు. ప్రధాని సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారా? పార్టీ నేతలెవరైనా దీనిపై ఏమైనా చెప్పారా? మేము ఎవరికీ రక్షణ కల్పించలేదు. అతడిని అరెస్టు చేశారు. విచారణ ముగియనివ్వండి. నేరం చేసినట్లు రుజువు అయితే పార్టీ నుంచి బర్తరఫ్‌ చేస్తారు.

ప్రశ్న: పలు కార్యక్రమాలకు ప్రభుత్వం సహకరించడం లేదని.. హెలికాప్టర్లు అందించడం లేదని తెలంగాణ గవర్నర్ అన్నారు?

కేటీఆర్: ప్రశ్నే లేదు. తాను ప్రభుత్వం కంటే అత్యున్నత వ్యక్తి అని గవర్నర్ భావిస్తే అది తప్పు, ఏదైనా మాట్లాడే అధికారం గవర్నర్‌కు ఉంది. కానీ ప్రభుత్వం ప్రజలకు ఏది మంచిదో అదే చేస్తోంది. నేను రోడ్డు మార్గంలో ప్రయాణిస్తాను. అందులో తప్పేముంది? ప్రధానమంత్రి కూడా రోడ్డు మార్గంలోనే ప్రయాణిస్తారు.

ప్రశ్న: చాలా మంది పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటర్ల ఆగ్రహానికి గురవుతున్నారు. మీరు ఆ వ్యక్తులతోనే ముందుకు వెళ్తున్నారా లేదా కొత్త ముఖాలకు అవకాశం ఇస్తున్నారా?

కేటీఆర్: నేను ఈ ప్రకటన చేయలేను. మరి ఓటర్ల తీరు ఎలా ఉంటుందో చూడాలి. పౌరులతో నాయకులు ఎలా కలుస్తున్నారో చూడాలి. విశ్లేషించడానికి మాకు తగినంత సమయం ఉంది. స్వల్ప మార్పులు ఉంటాయి. మేము అన్ని లాభాలు- నష్టాలను పరిగణనలోకి తీసుకుంటాము.

ప్రశ్న: జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏంటి?

కేటీఆర్ : రాజకీయం అంటే `ఈరోజు కంటే రేపు బాగుంటుంది`. మేము దాని గురించి ఏప్రిల్‌లో కాకుండా జూలైలో మాట్లాడుతాము.

Next Story