అమెరికా ప్రభుత్వంపై కేసు వేసిన చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి

Xiaomi sues the us-government for blocking Americans from investing in Chinese companies. చైనా స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ షియోమి సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా అమెరికా ప్రభుత్వంపైనే కేసు వేసింది.

By Medi Samrat  Published on  31 Jan 2021 7:00 PM IST
Chinese Company

చైనా కంపెనీల్లో అమెరికన్లు పెట్టుబడులు పెట్టరాదంటూ అమెరికా ప్రభుత్వం విధించిన నిషేధంపై చైనా స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ షియోమి సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా అమెరికా ప్రభుత్వంపైనే కేసు వేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కొలంబియా డిస్ట్రిక్ట్‌ కోర్టులో అమెరికా రక్షణ, ట్రెషరీ శాఖలను ప్రతివాదులుగా పేర్కొంటూ కేసు వేసింది.

కాగా, అమెరికా గత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో విధించిన ఈ నిషేధం కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ హయాంలో కూడా ఇదే విధంగా నిషేధం కొనసాగుతోంది. ఈనెల ప్రారంభంలో ట్రంప్‌ షియోమిని పెంటాగాన్‌ బ్లాక్‌ లిస్టులో పెట్టారు. ఈ జాబితా పేర్లు ఉన్న కంపెనీల్లో అమెరికన్లు పెట్టుబడులు పెట్టేందుకు నిషేధం విధించింది. చైనా మిలటరీతో షియోమికి సంబంధాలున్నాయని ఆరోపిస్తూ డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ ఆరోపణలను షియోమి గతంలో తీవ్రంగా ఖండించింది. తామే కమ్యునిస్టు చైనా మిలటరీ కంపెనీ కాదంటూ స్పష్టం చేసింది.

అయితే నూతన అధ్యక్షుడు బైడెన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అయినా ఊరట లభిస్తుందని ఆశించిన షియోమికి నిరాశే ఎదురైంది. నిషేధం ఎత్తివేసే దిశగా జో బైడెన్‌ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఈ నిషేధాన్ని కోర్టులో సవాలు చేసేందుకు షియోమి నిర్ణయించుకుంది. కమ్యునిస్టు ప్రభుత్వం అని వర్గీకరించడాన్ని షియోమి తప్పుబట్టింది. ఈ చట్ట వ్యతిరేకమైన చర్య అని, దీని వల్ల తమ కంపెనీ మళ్లీ మరింత నష్టపోయే అవకాశం ఉందని పేర్కొంది. త్వరలో దీనిపై ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించనున్నారు.


Next Story