చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ 'సెరిబ్రల్ అనూరిజం'తో బాధపడుతూ కొన్ని నెలల క్రితమే చికిత్స తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అధికారిక ధృవీకరణ రానప్పటికీ, గత కొంతకాలంగా అతని ఆరోగ్యంపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా ప్రస్తుతం COVID-19 తీవ్ర వ్యాప్తితో పోరాడుతున్న సమయంలోనూ, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP) చీఫ్ మూడవసారి అధ్యక్ష పదవిని చేపట్టాలని చూస్తున్న సమయంలోనూ కూడా ఆయన ఆరోగ్యంపై తీవ్ర వాదనలు వినిపించాయి.
జిన్ పింగ్ మెదడు సంబంధిత వ్యాధి సోకడంతో ప్రస్తుతం చైనీయుల సంప్రదాయ వైద్య చికిత్స తీసుకుంటున్నారు. సర్జరీకి బదులుగా ఆయన ఈ చికిత్స తీసుకుంటున్నారు. ఈ చికిత్స ద్వారా మెదడులోని రక్త నాళాలు మెత్తబడి వ్యాధి తగ్గే అవకాశాలు ఉంటాయి. మెదడులోని ధమనుల్లో వాపు రావడం వల్లే ఆయన చాలా కాలం నుంచి విదేశీ నేతలను కలవడం లేదు. కరోనా విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ వరకు ఆయన అన్ని సమావేశాలకు దూరంగానే ఉంటున్నారు. 2019లో జిన్ పింగ్ ఇటలీ పర్యటనకు వెళ్లిన సమయంలోనూ ఆయన ఇబ్బందులు పడ్డారు. ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సమయంలో నడిచేందుకు ఇబ్బందిపడ్డారు. కుర్చీపై కూర్చోవడానికి కూడా ఆయన ఇతరుల సాయం తీసుకున్నారు.