మహిళలకు జిమ్‌లు, పార్కుల్లోకి నో ఎంట్రీ
Women banned from Afghanistan gyms.తాలిబన్లు అఫ్గానిస్తాన్ ను దక్కించుకున్నప్పటి నుంచి మహిళా హక్కులను
By తోట వంశీ కుమార్
తాలిబన్లు అఫ్గానిస్తాన్ ను దక్కించుకున్నప్పటి నుంచి మహిళా హక్కులను, స్వేచ్ఛను హరిస్తున్నారు. తాజాగా తాలిబన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయిం తీసుకుంది. దేశంలోని పార్కులు, జిమ్‌లలో మహిళల ప్రవేశంపై నిషేదం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ వారం నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించకపోవడం, పార్కులు, జిమ్‌లలో మహిళలు, పురుషులు విభజనను పాటించకపోవడంతో ఈ ఆంక్షలను తీసుకువచ్చినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇప్పటికే రాజధాని కాబూల్‌లో ఈ నిబంధన అమలువుతోంది. ఈ విషయం తెలియకుండా పార్కుల దగ్గరికి వెళ్లిన మహిళలు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు నిష్క్రమించిన తరువాత 2021 ఆగస్టులో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అడుగడుగునా మహిళలపై ఆంక్షలు అమలు చేస్తూ వస్తున్నారు. బాలికలను హైస్కూల్ విద్యకు దూరం చేయడం, మహిళల ఉద్యోగాలను పరిమితం చేయడం, ఆటలు ఆడడం, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు కాలి నుంచి తల వరకు దుస్తులు ధరించాలని వంటి అనేక కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.
తాజాగా జిమ్‌లు, పార్కుల్లో మహిళలపై నిషేదం విధించారు. ఈ నిబంధన అమలుతో అఫ్గాన్ మహిళలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. తమ పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి పార్కుల్లోకి వెళ్లి కాసేపు సేదతీరే అవకాశాన్ని కూడా దూరం చేశారని అంటున్నారు.