సౌదీ అరేబియా.. అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయన్న వార్తలు మనం తరచూ వింటుంటాం. గతంలో మహిళలకు డ్రైవింగ్ చేసే వెసులుబాటు కల్పిస్తూ ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చిన ఆ దేశం.. తాజాగా 17 ఏళ్లు నిండిన యువతులకు కూడా డ్రైవింగ్ పర్మిట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సౌదీ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. 17 ఏళ్లు నిండిన యువతులు డ్రైవింగ్ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. అలాగే దరఖాస్తుకు కావాల్సిన అర్హతలను విడుదల చేసింది.
అయితే.. డ్రైవింగ్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునే యువతులకు మెడికల్ చెకప్ ఉంటుందని పేర్కొంది. డ్రైవింగ్ స్కూళ్లలో ఆరు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. యువతులపై డ్రగ్స్‌కు సంబంధించి ఎలాంటి కేసులు ఉండకూడదు. డ్రైవింగ్‌కు ఇబ్బంది కలిగించే ఆరోగ్య సమస్యలు ఉండరాదు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాలు ఉంటే.. వాటిని క్లియర్ చేసుకోవాలి. దరఖాస్తుదారులు సౌదీయేతరులు అయితే రెసిడెన్సీ పర్మిట్ తప్పనిసరిగా ఉండాలి. డ్రైవింగ్ స్కూళ్లలో నిర్వహించే థియేరిటికల్ టెస్టు పాస్ కావాలి.
అలా దరఖాస్తు చేసుకున్న యువతులకు తాత్కాలిక పర్మిట్ ఇవ్వబడుతుంది. ఈ డ్రైవింగ్ పర్మిట్ ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది. ఇక 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ డ్రైవింగ్ పర్మిట్‌నే డ్రైవింగ్ లైసెన్స్‌గా మార్చుకోవచ్చని సౌదీ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.