హెచ్ఐవీ-ఎయిడ్స్ నుండి పూర్తిగా కోలుకున్న మహిళ.. వైద్యరంగంలో అద్భుతమే..
Woman survives HIV through umbilical cord blood transplant method. హెచ్ఐవీ-ఎయిడ్స్ నుండి ఓ మహిళ అనూహ్యంగా కోలుకున్న ఘటనను వైద్య రంగంలో
By Medi Samrat Published on 18 Feb 2022 12:19 PM IST
హెచ్ఐవీ-ఎయిడ్స్ నుండి ఓ మహిళ అనూహ్యంగా కోలుకున్న ఘటనను వైద్య రంగంలో అద్భుతమని అంటున్నారు. అమెరికాలో నాలుగేళ్లుగా హెచ్ఐవీతో బాధపడుతున్న మహిళ యాంటీరిట్రో వైరల్ థెరపీని తీసుకుంటుంది. ఈమెకు శాస్త్రవేత్తలు మూలకణ చికిత్స అందించారు. వంద రోజుల తర్వాత పరీక్షించగా ఆమెలో హెచ్ఐవీ ఆనవాళ్లు కనిపించలేదు. ఈ విషయాన్ని 'రెట్రో వైరస్ అంటువ్యాధుల'పై నిర్వహించిన సదస్సులో పరిశోధకులు తెలిపారు. యాంటీ రిట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ) తీసుకుంటున్న మహిళకు శాస్త్రవేత్తలు 2017లో కార్డ్ బ్లడ్ మూలకణ మార్పిడి చికిత్స అందించారు. వంద రోజుల తర్వాత పలుమార్లు పరీక్షించగా, ఆమెలో అసలు హెచ్‌ఐవీ జాడ కనిపించలేదు. దీంతో 37వ నెలలో ఏఆర్‌టీని నిలిపివేశారు. కీమో థెరపీ ద్వారా తీవ్రమైన మైలోయిడ్ లుకేమియా నుంచి కూడా ఆమెకు ఉపశమనం లభించింది.
ఈ చికిత్స విధానం ప్రమాదకరమైనది, ప్రయోగాత్మకమైనది, ఖరీదైనది అయినప్పటికీ, ఇది ప్రపంచంలోని 3.7 కోట్ల (37 మిలియన్లు) మందికి హెచ్ఐవీని ఓడించగలమనే ఆశలు రేకెత్తించింది. భారతదేశంలో 24 లక్షల మంది హెచ్ఐవీతో పోరాడుతూ ఉండగా.. 1.5 లక్షల మంది తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. ఫిబ్రవరి 14న యునైటెడ్ స్టేట్స్‌లోని డెన్వర్‌లో రెట్రోవైరస్‌లపై జరిగిన మెడికల్ కాన్ఫరెన్స్‌లో US మహిళలో HIV ఉపశమనానికి సంబంధించిన వివరాలను ఇంటర్నేషనల్ మెటర్నల్ పీడియాట్రిక్ అడోలసెంట్ ఎయిడ్స్ క్లినికల్ ట్రయల్స్ నెట్‌వర్క్ (IMPACT) పరిశోధకులు సమర్పించారు. ఇంతకుముందు, HIV పూర్తిగా నయమైన మొదటి రోగిని 'బెర్లిన్ పేషెంట్' అని పిలుస్తారు. అతను క్యాన్సర్, HIV కలిగి ఉన్న కాకేసియన్ మగ వ్యక్తి. రెండవ రోగి 'లండన్ పేషెంట్', లాటినో పురుషుడు క్యాన్సర్, HIVతో అతడు పోరాడాడు.
లుకేమియా కారణంగా బెర్లిన్ పేషెంట్ సెప్టెంబర్, 2020లో మరణించగా.. లండన్ రోగికి క్లినికల్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ రవీంద్ర గుప్తా చికిత్స అందిస్తూ ఉన్నారు. లండన్ రోగి 30 నెలలకు పైగా హెచ్ఐవీ నుండి ఉపశమనాన్ని అనుభవిస్తున్నారు. క్యాన్సర్, హెచ్ఐవీ ఉన్న ముగ్గురు రోగులకు ప్రయోగాత్మక స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ టెక్నిక్ ద్వారా హెచ్ఐవీ పూర్తిగా నయమైంది. సెప్టెంబర్, 2020లో లుకేమియా కారణంగా మరణించే ముందు, బెర్లిన్ రోగి 12 సంవత్సరాల పాటు హెచ్ఐవీ నుండి ఉపశమనం పొందాడు. హెచ్ఐవీ నుండి పూర్తిగా కోలుకున్నాడు. హెచ్ఐవీకి నివారించే మందు, వ్యాక్సిన్స్ లేవు. హెచ్ఐవీకి నిరోధకత కలిగిన వ్యక్తుల నుండి మూలకణాలను సేకరించి, ఆపై వాటిని హెచ్‌ఐవి పాజిటివ్ రోగులలో మార్పిడి చేస్తారు. HIV-నిరోధక మూలకణాలు క్రమంగా రోగులలో నిరోధక కణాలను భర్తీ చేయడానికి పని చేస్తాయి. చివరికి హెచ్ఐవీ కణాలు శరీరంలో లేకుండా చేస్తాయి.