ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జంతువును అమాయకంగా చేతుల్లోకి తీసుకుంది. ఆ సమయంలో ఆమె తన ప్రాణాన్ని ప్రమాదంలో పడేసుకుంది. టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఓ మహిళ సముద్రం నుండి ఒక చిన్న ఆక్టోపస్‌ను తీయడం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆమె తన ఎడమ చేతిలో ఆక్టోపస్‌ను పట్టుకుని ముందుకు వెళ్ళింది. అది క్షణాల్లో ఆమె ప్రాణాలను తీయగలిగే అత్యంత విషపూరితమైన ఆక్టోపస్ అనే విషయాన్ని ఆమె పూర్తిగా విస్మరించింది.
పోస్ట్ ను చూసిన వ్యక్తులు ఆమె చేతుల్లో ఉన్నది ఎంతో ప్రమాదకరమైన ఆక్టోపస్ అని చెప్పుకొచ్చారు. ఇది బ్లూ రింగ్ ఆక్టోపస్ అని.. ఎంతో విషపూరితమైనదని పలువురు సూచించారు. వెంటనే దాన్ని సముద్రం లోకి విసిరేసి అక్కడి నుండి వెళ్లిపోవాలని కొందరు సూచించారు.
ఆమె పట్టుకున్న ఆక్టోపస్ బ్లూ-రింగ్డ్ ఆక్టోపస్, సాధారణంగా ఆస్ట్రేలియాలోని సమశీతోష్ణ దక్షిణ జలాల్లో కనిపిస్తుంది. ఆ ఆక్టోపస్ ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు నీలం రంగులో మెరుస్తుందని.. అందుకే దీనికి దాని పేరు వచ్చింది. ఈ ఆక్టోపస్ తనను తినడానికి వచ్చిన వాటిపై రెండు రకాల విషాన్ని స్రవిస్తుంది. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ, అవి ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన సముద్ర జంతువులలో ఒకటిగా ప్రసిద్ధి చెందాయి. బ్లూ-రింగ్డ్ ఆక్టోపస్‌లు దాడి చేస్తే మానవుల ప్రాణాలకు ప్రమాదకరం, వాటి విషంలో శక్తివంతమైన న్యూరోటాక్సిన్ టెట్రోడోటాక్సిన్ ఉంటుంది.