కమలా హ్యారిస్ హత్య కుట్ర చేసిన మహిళ
Woman Admits Threatening to Kill Vice President Kamala Harris. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ హత్యకు ఓ మహిళ చేసిన కుట్రను పోలీసులు
By Medi Samrat Published on 17 Sept 2021 3:36 PM IST
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ హత్యకు ఓ మహిళ చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ను చంపేందుకు కుట్ర పన్నినట్లు మియామీకి చెందిన నర్స్ అంగీకరించిందని ఆదేశ న్యాయశాఖ ప్రకటించింది. 39 ఏళ్ల నివియాన్ పెటిట్ ఫెల్ప్స్.. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హత్యకు కుట్ర సహా మరో ఆరు నేరారోపణలను అంగీకరించినట్లు న్యాయశాఖ తెలిపింది. ఈ ఏడాది నవంబర్ 19న ఆమెకు శిక్ష ఖరారు చేయనుండగా.. తాజాగా ఆమె చేసిన తప్పులను అంగీకరించి ప్రాయశ్చిత్తం వ్యక్తం చేసినట్లు ప్రకటించింది. ఫెల్ప్స్‌కు ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడనుందని న్యాయశాఖ వర్గాలు తెలిపాయి.
నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మియామీ ఫెడరల్ కోర్టులో హాజరు పరిచారు. కమలా హ్యారిస్‌ను హత్య చేసేందుకు దుండగులతో 53 వేల డాలర్లకు (భారత కరెన్సీలో దాదాపు రూ. 39 లక్షలు) ఒప్పందం కుదుర్చుకున్నట్టు నిందితురాలు న్యాయస్థానంలో అంగీకరించింది. దక్షిణ ఫ్లోరిడాకు చెందిన నివియేన్ పెటిట్ ఫెల్ప్స్ (39) కమలను హత్య చేసేందుకు ఏకంగా ఆరుసార్లు కుట్ర పన్నినట్టు కోర్టులో అంగీకరించింది. 50 రోజుల్లో కమలను హత్య చేయబోతున్నానంటూ జైలులో ఉన్న తన భర్తకు వీడియో మెసేజ్ పంపడం ద్వారా ఆమె దొరికిపోయింది. ఆమె కుట్రను పసిగట్టిన నిఘా వర్గాలు ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచాయి.
కమలను హత్య చేసేందుకు తుపాకి లైసెన్స్‌కు కూడా ఆమె దరఖాస్తు చేసుకుంది. కేసును విచారించిన న్యాయస్థానం నిందితురాలిని దోషిగా తేల్చింది. ఫెల్ప్స్ తన భర్తకు వీడియోలను పంపిన తరువాత.. టార్గెట్ షీట్‌తో తుపాకీని పట్టుకున్న ఫోటోను కూడా పంపినట్లు తెలిపారు ప్రాసిక్యూటర్లు. ఆ తరువాత ఆయుధ వినియోగానికి అనుమతి కోరుతూ దరఖాస్తు కూడా చేసుకున్నట్లు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. ఒకవేళ ఆమెను అరెస్టు చేయకపోయింటే పరిస్థితి చేయి దాటిపోయి ఉండేదని అధికారులు తెలిపారు.