శ్రీలంకలో పాఠశాలలు బంద్

With no fuel and no cash, Sri Lanka keeps schools closed. శ్రీలంక దేశం పరిస్థితి రోజు రోజుకీ ఎంతో దారుణంగా తయారవుతూ వస్తోంది.

By Medi Samrat  Published on  4 July 2022 5:21 AM GMT
శ్రీలంకలో పాఠశాలలు బంద్

శ్రీలంక దేశం పరిస్థితి రోజు రోజుకీ ఎంతో దారుణంగా తయారవుతూ వస్తోంది. ఆర్థికంగా కుదేలైన ఈ దేశంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. తినడానికి తిండి లేక ప్రజలు ఓ వైపు ఇబ్బంది పడుతూ ఉండగా.. ఇక పిల్లల విద్య మీద కూడా ప్రభావం చూపుతూ ఉంది. దేశంలో ఇప్పటికే ఇంధన సంక్షోభం ఉండగా.. ఆ ఎఫెక్ట్ పిల్లల చదువు మీద కూడా పడింది. ఇంధన సంక్షోభం కారణంగా శ్రీలంక విద్యా మంత్రిత్వ శాఖ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జూలై 4 నుండి సెలవులు ప్రకటించింది. శ్రీలంక విద్యా మంత్రి మాట్లాడుతూ పరిస్థితులు చక్కబడ్డాక.. పాఠశాలల్లో సిలబస్‌ను కవర్ చేస్తామని చెప్పుకొచ్చారు. అంతకుముందు కూడా జూన్ 18న శ్రీలంక ప్రభుత్వం వారం రోజుల పాటు అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

కొలంబో నగర పరిమితుల్లోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వం ఆమోదించిన ప్రైవేట్ పాఠశాలలు, అలాగే ఇతర ప్రావిన్సులలోని ఇతర ప్రధాన నగరాల్లోని పాఠశాలలు దీర్ఘకాలిక విద్యుత్ కోతల కారణంగా వచ్చే వారంలో మూసివేయబడతాయని అక్కడి విద్యాశాఖ ప్రకటించింది. శ్రీలంక విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిహాల్ రణసింగ్ పాఠశాలలను ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని కోరారు. రవాణా ఇబ్బందులు లేకుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు డివిజన్ స్థాయిలోని పాఠశాలలకు చేరుకోగలిగితే అక్కడ మాత్రం తరగతులను నిర్వహించడానికి అనుమతించనున్నారు. వారాంతపు రోజులలో ఆన్‌లైన్ బోధనను సులభతరం చేయడానికి ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు కరెంటు కోతలు ఉండకూడదని శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమీషన్ (PUCSL) అంగీకరించింది.














Next Story