పురుషుల నుండి విడివిడిగా చదువుతున్నంత కాలం ఆఫ్ఘన్ మహిళలు విశ్వవిద్యాలయాల్లోకి అనుమతించబడతారని తాలిబాన్ కొత్త ఉన్నత విద్యా శాఖా మంత్రి ఆదివారం చెప్పారు. తాలిబాన్ యొక్క 1996-2001 పాలనలో ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల హక్కులను తొక్కేశారు. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత ప్రభుత్వం తరహాలో ఆంక్షలే ఇప్పుడు కూడా మహిళల విషయంలో తీసుకుని వస్తారని ఆ దేశ మహిళలు భయపడుతూ ఉన్నారు.
దేశంలో మహిళల విద్య విషయంలో ప్రణాళికల గురించి విలేకరులతో మాట్లాడిన మంత్రి అబ్దుల్ బాకీ హక్కానీ అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చదువుకోవడం అన్నది కుదరదని తేల్చి చెప్పారు. అమ్మాయిలకు ప్రత్యేకంగా క్లాసులు ఉంటాయని.. అబ్బాయిలకు ప్రత్యేకంగా క్లాసులు ఉంటాయని తేల్చి చెప్పారు. మహిళలు బుర్ఖా లను ధరించినట్లయితే యూనివర్సిటీలో చదువుకోవచ్చునని తాలిబాన్ ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది.
తాలిబాన్లు చివరిసారిగా అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విద్యా వ్యవస్థ బాగా మారిందని హక్కానీ అన్నారు. గతంతో పోలిస్తే విద్యాసంస్థల సంఖ్య గణనీయంగా పెరిగింది అని ఆయన చెప్పారు. మహిళలకు విద్యను అందించడానికి తగినంత మంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారని.. నియమాలను ఉల్లంఘించకుండా ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలిపారు. ఒకవేళ కొన్ని సబ్జెక్టులను చెప్పడానికి మహిళలు లేకపోతే.. పురుష ఉపాధ్యాయులను కూడా ఉపయోగించుతామని.. సాంకేతికతను కూడా వాడతామని అన్నారు.