అట్టుడుకుతున్న పాకిస్థాన్
Why France has asked its citizens to leave Pakistan. పాకిస్థాన్ అట్టుడుకుతోంది. నిషేధిత ఇస్లామిక్ గ్రూపు- తెహ్రీక్-ఇ-లిబాయక్
By Medi Samrat
పాకిస్థాన్ అట్టుడుకుతోంది. నిషేధిత ఇస్లామిక్ గ్రూపు- తెహ్రీక్-ఇ-లిబాయక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) నాయకుడు సాద్ రిజ్వీని మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. దీంతో ఆ పార్టీ మద్దతుదారులు నిరసన కార్యక్రమాలను మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించడమే కాకుండా.. నిరసన ప్రదర్శనలు కొనసాగుతూ ఉన్నాయి. పాకిస్థాన్ లోని ప్రధాన నగరాలైన లాహోర్, కరాచీ, రావల్పిండిల్లో పరిస్థితులను అదుపుచేయలేకపోతున్నారు పోలీసులు. శుక్రవారం ప్రార్థనల అనంతరం హింస మరింత ప్రబలవచ్చని భావించి ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్, టెలిగ్రామ్, యూట్యూబ్ మొదలైన సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది. చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను సైతం కట్ చేసింది. అయినా కూడా ఆందోళనకారులు వెనక్కు తగ్గడం లేదు.
టీఎల్‌పీ పాక్ ఎలక్షన్ కమిషన్లో రిజిస్టరై 2018 ఎన్నికల్లో సైతం పోటీచేసింది. దాని అధినేత సాద్ రిజ్వీ. మత దూషణ ప్రపంచంలో ఎక్కడ జరిగినా పాక్‌లో ప్రదర్శనలను నిర్వహించాలని అంటూ ఉంటారు. మహమ్మద్ ప్రవక్తపై చార్లీ హెబ్డో సహా కొన్ని ఫ్రెంచి పత్రికల్లో కార్టూన్లను ప్రచురించడంపై సాద్ రిజ్వీ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. గత నెలరోజులుగా టీఎల్‌పీ నిరసన కార్యక్రమాలను ఉధృతం చేసింది. దీంతో పోలీసులు మంగళవారం నాడు రిజ్వీని అరెస్టు చేశారు. దీంతో ఆ పార్టీ ప్రత్యక్ష హింసకు దిగింది. నలుగురు పోలీసులు సహా ఏడుగురు వ్యక్తులు ఇప్పటిదాకా చనిపోయారు. 600కు పైగా ఆందోళనకారులు గాయపడ్డారు. భారీ ఎత్తున ప్రభుత్వ ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేస్తున్నారు. ఫ్రాన్స్‌తో సంబంధాలు తెగతెంపులు చేయాలని, దేశంలోని ఫ్రెంచి వారందరినీ పంపేయాలనీ ఈ గ్రూప్ డిమాండ్ చేస్తోంది. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం నిరాకరించింది. అలా చేస్తే పాక్ ప్రయోజనాలకు దెబ్బ తగులుతుందని స్పష్టం చేసింది.ఆ సంస్థను ఉగ్రవాద తండాగా ముద్ర వేసి నిషేధం విధించింది. దీంతో మరిన్ని ఇస్లామిక్ గ్రూపులు దీన్ని నిరసిస్తూ ప్రదర్శనలు మొదలెట్టాయి. దీంతో ఇక హింస మరింత చెలరేగిపోయింది.