టెన్షన్ పడకండి.. ఒమిక్రాన్ తో ఎవరూ చనిపోలేదు.. కానీ..!

WHO On Omicron. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ భయం పట్టుకుంది. చాలా దేశాల్లో ఇప్పుడు

By Medi Samrat  Published on  4 Dec 2021 1:03 PM GMT
టెన్షన్ పడకండి.. ఒమిక్రాన్ తో ఎవరూ చనిపోలేదు.. కానీ..!

ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ భయం పట్టుకుంది. చాలా దేశాల్లో ఇప్పుడు ఈ వేరియంట్ బయట పడుతోంది. భారత్ లో కూడా ఈ వేరియంట్ కు సంబంధించి తీవ్రమైన చర్చ కొనసాగుతూ ఉంది. ఇలాంటి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కాస్త గుడ్ న్యూస్ చెప్పింది. ఒమిక్రాన్ వేరియంట్ తో ఇప్పటివరకూ ఎవరూ చనిపోలేదని వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్ కు సంబంధించి ప్రపంచ దేశాల నుంచి విస్తృతస్థాయిలో సమాచారం సేకరిస్తున్నామని తెలిపింది. ఒమిక్రాన్ సంక్రమణ వేగం, వ్యాధి లక్షణాల తీవ్రత, దీనిపై వ్యాక్సిన్ల పనితీరు, చికిత్సకు స్పందించే తీరుపై పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి.

జెనీవాలో డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి క్రిస్టియన్ లిండ్మీయర్ మాట్లాడుతూ, ఒమిక్రాన్ తో ఎక్కడా ఎలాంటి మరణాలు నమోదు కాలేదని అన్నారు. ప్రపంచ దేశాలు ఒమిక్రాన్ నేపథ్యంలో అత్యధిక టెస్టులు నిర్వహిస్తున్నందువల్ల మరిన్ని కేసులు గుర్తించగలమని, మరింత సమాచారాన్ని తెలుసుకోగలమని అన్నారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా, తీవ్ర ప్రభావం చూపిన వేరియంట్ గా డెల్టా వేరియంట్ గురించే చెబుతామని ఆయన అన్నారు. దీని గురించి తెలుసుకోవడానికి మరికొన్ని వారాల సమయం పడుతుందని అన్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించిన సౌతాఫ్రికా మెడికల్ అసోసియేషన్ చైర్ పర్సన్ డాక్టర్ ఏంజెలిక్ కొయెట్జీ మాట్లాడుతూ ఒమిక్రాన్ తో తీవ్రమైన జబ్బు లక్షణాలేం ఉండవని చెప్పారు. ఒళ్లు నొప్పులు, తలనొప్పి, తీవ్రమైన అలసట వంటి లక్షణాలుంటాయన్నారు. వాసన, రుచి కోల్పోవడం, ముక్కు మూసుకుపోవడం, తీవ్రమైన జ్వరమూ వంటివి ఉండవన్నారు. డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ తో వచ్చే లక్షణాల తీవ్రత చాలా తక్కువని.. ఆసుపత్రిలో చేరకుండా.. ఇంట్లోనే నయం చేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం యువతలోనూ ఇది ప్రభావం చూపిస్తోందని, అయితే, యువతపైనే దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని ఇప్పుడే నిర్ధారించలేమని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకూ అది సోకినా.. వ్యాక్సిన్ వేసుకోని వాళ్లతో పోలిస్తే రక్షణ ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఇంతకు ముందు కరోనా సోకిన ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలో ఏర్పడిన రక్షణ వ్యవస్థ నుంచి కొత్త వేరియంట్ తప్పించుకోగలుగుతున్నట్టు ఇంకో అధ్యయనంలో వెల్లడైంది. గతంలో కరోనా బారినపడిన వారికి ఒమిక్రాన్ వేరియంట్ సోకదన్న అపోహలు ఏమైనా ఉంటే వాటిని పక్కనపెట్టి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మునుపటి ఇన్ఫెక్షన్‌తో ఏర్పడిన రక్షణ వ్యవస్థను ఒమిక్రాన్ తప్పుదోవ పట్టించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనలో తేలిందట. కాబట్టి ఇంతకు ముందు కరోనా వచ్చింది.. ఇప్పుడు రాదని మాత్రం అనుకోకండి.


Next Story