కోవిడ్-19.. ప్రపంచ దేశాలను వణికించిన మహమ్మారి. ఎప్పుడు ఏమి జరుగుతుందా అని ప్రపంచం మొత్తం భయంతో వణికిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) దీన్ని మహమ్మారిగా ప్రకటించడం.. ఎప్పటికప్పుడు కరోనా గురించిన అప్డేట్స్ ను ఇస్తూ ఉంటే ప్రపంచం మొత్తం వాటిని పాటిస్తూ వెళ్ళింది. ఇలా కొన్ని నెలలు.. సంవత్సరాలు గడిచాక మాత్రమే కరోనా ప్రభావం తగ్గింది.
తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19 పై కీలక ప్రకటన చేసింది. కోవిడ్-19ను ఇకపై గ్లోబల్ ఎమర్జెన్సీగా చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం తెలిపింది. కోవిడ్-19 ఒకప్పుడు ఎవరూ ఊహించని లాక్‌డౌన్‌లను ప్రపంచానికి చూపించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేసింది. కొన్ని కోట్ల మంది మహమ్మారికి బలయ్యారు. అత్యవసర దశ ముగిసినప్పటికీ, మహమ్మారి అంతం కాలేదని WHO తెలిపింది. ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యంలో ఇటీవలి కాలంలో కరోనా కేసులు పెరిగాయి. ప్రతివారం వేలాది మంది ఈ వైరస్ బారిన పడి మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇకపై కోవిడ్ -19 ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించలేమని.. అయితే ముప్పు లేదని మాత్రం నమ్మకండని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటిసారిగా జనవరి 30, 2020న కరోనావైరస్‌ను అంతర్జాతీయ సంక్షోభంగా ప్రకటించినప్పుడు, దానికి ఇంకా కోవిడ్-19 అని పేరు కూడా పెట్టలేదు.