చైనాలోని ప్రాంతాల పేర్లను భారత్ మారిస్తే.?
అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు చైనా పేరు మార్చడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ప్రతిస్పందించారు.
By Medi Samrat Published on 9 April 2024 4:15 PM GMTఅరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు చైనా పేరు మార్చడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఒకవేళ భారత్ కూడా చైనాలోని ప్రాంతాలకు పేర్లు పెట్టడం మొదలు పెడితే ఎలా ఉంటుందో ఊహించగలరా అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే చైనాలోని ఆ ప్రాంతాలు మన భూభాగంలో భాగాలుగా మారిపోతాయని అన్నారు. మంగళవారం అరుణాచల్ ప్రదేశ్‌లోని నంసాయ్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశంలోని వివిధ రాష్ట్రాల పేర్లను మేము కూడా మార్చొచ్చా అని నేను చైనాను అడగాలనుకుంటున్నాను.. అవి మన భూభాగంలో భాగాలు అవుతాయా అని అన్నారు. అటువంటి కార్యకలాపాల కారణంగా భారతదేశం-చైనా మధ్య సంబంధాలు మరింత చెడిపోతాయని రాజ్ నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు.
గత వారం, అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి వివిధ ప్రాంతాలకు సంబంధించిన 30 కొత్త పేర్లను చైనా విడుదల చేసింది. గతంలోనూ ఈశాన్య రాష్ట్రంపై తమ హక్కును చాటుకునేందుకు చైనా ఇలాంటి ప్రయత్నాలు చేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని 30 ప్రాంతాల పేర్లను మార్చే చైనా చర్య వాస్తవికతను మార్చలేదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మేము మా పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కొనసాగించాలనుకుంటున్నాము.. కానీ ఎవరైనా భారత దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే, తగిన సమాధానం ఇవ్వగల సామర్థ్యం భారతదేశానికి ఉందని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని రక్షణ మంత్రి అన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా వాదనలను తిరస్కరించింది.