ప్రపంచ ఆరోగ్య సంస్థ థర్డ్ వేవ్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా మహమ్మారి జన్యు మార్పులకు గురవుతూ ఉండడంతో రాబోయే రోజుల్లో ముప్పు తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి హెచ్చరికలు చేసింది. థర్డ్ వేవ్ ముప్పు ముంగిట ఉన్నామని.. దురదృష్టవశాత్తూ థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉన్నామని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథ్నామ్ ఘ్యాబ్రియోసిస్ గురువారం నాడు ఆందోళన వ్యక్తం చేశారు.
డెల్టా వేరియంట్ వేరియంట్‌తో ముడిపడిన కేసులు అన్ని ప్రాంతాల్లోనూ పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఏప్రిల్ 13 నాటికి 111 దేశాల్లో ఈ వేరియంట్ ఉనికి ఉందని, మున్ముందు ఇది మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. డెల్టా వేరియంట్ వ్యాప్తి కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాలు రెండింటిలోనూ పెరుగుదల నమోదవుతున్నాయని చెప్పింది. వైరస్ అభివృద్ధి చెందుతూనే ఉందని దీంతో మరింత వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్‌లు పుట్టుకొస్తున్నాయని టెడ్రోస్ అన్నారు.
డబ్ల్యూహెచ్ఓ పరిధిలోని ఆరు రీజియన్లలో వరుసగా నాలుగు వారాల నుంచి కోవిడ్ కేసులు పెరుగుతునే ఉన్నాయి. అలాగే పది వారాలు తగ్గిన మరణాలు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. చాలా దేశాలు ఇప్పటి వరకూ ఎటువంటి టీకాలను పొందలేదని అన్నారు. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ప్రతి దేశం తన జనాభాలో కనీసం 10 శాతం మందికి, డిసెంబరుకు 40 శాతం మందికి, 2022 మధ్య నాటికి 70 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని కోరారు.