Video : కుప్ప‌కూలిన F-35 యుద్ధ విమానం.. పైలట్ సురక్షితం

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానం F-35 ప్రమాదానికి గురైంది.

By Medi Samrat  Published on  29 Jan 2025 3:03 PM IST
Video : కుప్ప‌కూలిన F-35 యుద్ధ విమానం.. పైలట్ సురక్షితం

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానం F-35 ప్రమాదానికి గురైంది. మంగళవారం అలస్కాలోని ఐల్సన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో యుఎస్ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం కూలిపోయింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానం ఆకాశం నుంచి నేలపై పడిన తర్వాత అగ్నికిల‌లు ఎగసిపడడం వీడియోలో చూడవచ్చు.

యుఎస్ ఎయిర్ ఫోర్స్ కల్నల్ పాల్ టౌన్‌సెండ్, 354వ ఫైటర్ వింగ్ కమాండర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పైలట్ "సాంకేతిక వైఫల్యం" ఎదుర్కొన్నాడు.. ఆ తర్వాత అతడు విమానం నుండి బయటపడ్డాడని AP వార్తా సంస్థ నివేదించింది. పైలట్ సురక్షితంగా ఉన్నాడు. అత‌డిని బాసెట్ ఆర్మీ ఆసుపత్రికి తరలించిన‌ట్లు పేర్కొన్నారు.

అమెరికాలో F-35 విమానం గగనతలంలో కూలిపోవడం ఇదే మొదటిసారి కాదు. టెక్సాస్ నుండి లాస్ ఏంజిల్స్ సమీపంలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు వెళుతున్న F-35 ఫైటర్ జెట్.. మే 2024లో న్యూ మెక్సికోలో ఇంధనం నింపుకోవడానికి పైలట్ ఆపేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. కుప్ప‌కూలిపోయింది. తీవ్ర గాయాలపాలైన పైలట్‌ను ఆస్పత్రికి తరలించారు. మ‌రో యుద్ధ విమానం 2023 సెప్టెంబర్‌లో సౌత్ కరోలినాలో కూలిపోయింది.


Next Story