గాజా నగరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా జరిగిన వైమానిక దాడులలో గాజాలోని మూడు భవనాలు కుప్పకూలిపోయాయి. 26 మంది పాలస్తీనా పౌరులు మృతిచెందారు. మృతుల్లో 10 మంది మహిళలు, ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 50 మందికిపైగా గాయపడినట్లు సమాచారం.
గాజాలో హమాస్ మిలిటెంట్ నాయకులు తలదాచుకున్న భవనాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. శుక్రవారం మరో పట్టణంలో జరిగిన దాడిలో గాజా అగ్రశ్రేణి హమాస్ నాయకుడి ఇంటిని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. సీనియర్ హమాస్ నాయకుల ఇళ్లపై గత రెండు రోజుల్లో ఇది మూడవ దాడి. ఇప్పటి వరకూ ఈ దాడుల వల్ల భారీ ఆస్తి నష్టం జరిగింది. మొత్తం 181 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 31 మంది మహిళలు, 52 మంది పిల్లలు ఉన్నారు. ఇక ఇక్కడి చిన్న పిల్లల పరిస్థితి ఘోరంగా తయ్యారయ్యింది. కళ్ళముందు జరుగుతున్న దాడులను చూస్తూ ఏం చెయ్యాలో తెలియక వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
స్థానికంగా నివసించే పదేళ్ల బాలిక తన ఇంటి ముందు కనిపిస్తున్న శిథిలాలను చూస్తూ కన్నీరు పెడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తను పెద్దయ్యాక డాక్టర్ అయి పేదలకు సేవలు చేద్దామనుకున్నాన్న ఆమె, తన ఆశలన్నీ ఆవిరయ్యాయని ఏడుస్తున్న వీడియో అందరి మనసులను కదిపేస్తోంది. ఆల్ జజీరాకు చెందిన ఓ ప్రొడ్యూసర్ ఈ వీడియోను తన ట్విటర్ లో షేర్ చేయగానే ఒక రోజులో 6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.