హైతీ దేశంలో అమెరికాకు చెందిన మిషనరీల కిడ్నాప్ కలకలం రేపుతోంది. 17 మంది అమెరికా మిషనరీలు కిడ్నాప్ అయినట్లు తెలుస్తోంది. అయితే వీరిని హైతీలోని ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేసినట్లు సమాచారం. హైతీ క్యాపిటల్ సిటీ పోర్ట్-ఓ-ప్రిన్స్‌లోని ఓ అనాథాశ్రమం నుంచి బయటకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమెరికన్ క్రిస్టియన్ మిషనరీల బృందంలోని కొందరిని ఎయిర్‌పోర్టులో దింపేందుకు వెళ్తున్నట్లు తెలిసింది. చిన్న పిల్లలు కూడా కిడ్నాప్ అయ్యారు. హైతీ అత్యంత పేద దేశాల్లో ఒకటి. ఇక్కడ గత కొంత కాలంగా గ్యాంగ్ వార్‌లు మితిమీరుతున్నాయి. దీని కారణంగానే ఇక్కడ చాలా మంది అనాథలవుతున్నారు. ఇక దేశ ఆర్థిక పరిస్థితి మరీ దారుణం.
కిడ్నాప్ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. కిడ్నాప్ గురైన మిషనరీలను క్షేమంగా తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించామని హైతీ పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. కిడ్నాప్ జరిగిన తీరుకు సంబంధించి సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. అయితే కిడ్నాప్ వ్యవహారంపై హైతీలోని అమెరికాలోని రాయబార కార్యాలయం ఇంతవరకు స్పందించలేదు. గత కొంతకాలంగా పోర్ట్-ఓ-ప్రిన్స్, డొమినికన్ రిపబ్లిక్ బార్డర్‌లో ముష్కరుల ముఠా చురుకుగా ఉంది. కిడ్నాప్‌కు గురైన మిషనరీలు హైతీలో అనాథాశ్రమం నిర్మిస్తున్నారని తెలిసింది.