అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం దక్షిణాసియాలోని పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘానిస్తాన్‌లకు వెళ్లాలనుకునే తమ పౌరులకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పాక్‌కు వెళ్లాలనునే వారు తమ ప్రయాణాలపై పునరాలోచన చేయాలని సూచించింది. కరోనా పరిస్థితులతో పాటు పాక్‌లో ఉగ్రవాదం, విభజనవాదుల హింస అధికంగా ఉండడమే ఇందుకు కారణమని తెలిపింది.
పాకిస్తాన్‌లోని బలుచిస్థాన్, ఖైబర్, పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లను మాత్రం అసలు వెళ్లరాదని సూచించింది. అక్కడ ఉగ్రవాదులతో పాటు అపహరణ ముఠాల ప్రమాదం పొంచివుందని తెలిపింది. నియంత్రణ రేఖ సమీప ప్రాంతాల్లోకి వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ ఉగ్రవాదం కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపింది. నియంత్రణ రేఖకు ఇరువైపులా భారత్, పాక్‌ల సైనిక బలగాలు భారీ సంఖ్యలో మోహరించి ఉంటాయని, వారి మధ్య తరచూ యుద్ధ వాతావరణం చోటు చేసుకుంటున్నాయని తెలిపింది.
బంగ్లాదేశ్ లో నేరాలు, ఉగ్రవాదం, అపహరణల ముప్పు అధికంగా ఉందని, ఈ ప్రాంతానికి వెళ్లినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అప్ఘాన్‌లో అపహరణ ముఠాలు, ఆత్మాహుతి దాడులు, ఉగ్రవాదంతో అశాంతి నెలకొని ఉందని, అక్కడికి వెళ్లకపోవడమే ఉత్తమమని తెలిపింది. అలాగే కరోనా మహమ్మారి నేపథ్యంలో అమెరికాకు వచ్చే విదేశీ ప్రయాణికులకు కొత్త నిబంధనలు తీసుకువచ్చింది అమెరికా.
ప్రయాణానికి ముందు మూడు రోజుల్లోపు వారు కరోనా నెగిటివ్ నివేదికను విమానయాన సంస్థకు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి తెలిపారు. జనవరి 26 నుంచే ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయన్నారు. మరోవైపు ఐరోపా దేశాలతో పాటు బ్రిటన్, బ్రెజిల్, ఐర్లాండ్ దేశాల ప్రయాణికులు అమెరికాలోకి రాకుండా మళ్లీ ఆంక్షలను విధిస్తూ బైడెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా నివారణ బృందం సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దక్షిణాఫ్రికాలో కొత్త వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రయాణికులపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు.