ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలిగాయి. అర్థరాత్రి చివరి అమెరికన్ విమానం కాబూల్ విమానాశ్రయం నుండి బయలుదేరింది. దీంతో ఇరవై సంవత్సరాల క్రితం ఆఫ్ఘన్‌లో ప్రారంభమైన అమెరికా యుద్ధం ముగిసింది. తాలిబాన్లతో ఒప్పందం ప్రకారం.. ఆగస్టు 31లోపు అమెరికా ఆఫ్ఘన్‌ను పూర్తిగా వదులుకోవాల్సి ఉంది. దీంతో కాబూల్ విమానాశ్రయం నుండి చివరి నాలుగు యుఎస్ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ విమానాలు సీ -17 బయలుదేరాయి. వెంటనే తాలిబాన్ ఫైటర్లు సంబరాలు చేసుకున్నారు. గాలిలో కాల్పులు జరుపుతూ విచిత్ర విన్యాసాలు చేశారు.
గత 17 రోజులుగా అఫ్గనిస్తాన్‌లో తమ బలగాలు చేపట్టిన పౌరుల తరలింపు ప్రక్రియ దేశ చరిత్రలోనే అతి పెద్దదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. సుమారు 1,20,000 వేల మందిని తరలించినట్లు పేర్కొన్నారు. అఫ్గన్‌లో బలగాల ఉపసంహరణ పూర్తైన నేపథ్యంలో బైడెన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘ కాలంగా అఫ్గనిస్తాన్‌లో సేవలు అందిస్తున్న అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ పూర్తైందని అన్నారు. పెంటగాన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
యూఎస్ జనరల్ కెన్నెత్ మెకాంజీ మాట్లాడుతూ.. అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ, అమెరికా పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తైందని ప్రకటన చేస్తున్నా.. సెప్టెంబరు 11, 2001 నుంచి దాదాపు 20 ఏళ్లుగా అఫ్గన్‌లో చేపట్టిన ఆపరేషన్ ముగిసిందని పేర్కొన్నారు. హమీద్ కర్జాయి ఎయిర్‌పోర్టు నుంచి సీ-17 విమానం బయల్దేరడంతో బలగాల ఉపసంహరణ ముగిసిందన్నారు.