మనోళ్లకు భారీగా వీసాలను ఇస్తున్న అమెరికా

అమెరికాలో చదువుకోవాలని అనుకునే భారత విద్యార్థులకు అమెరికా ప్రాధాన్యత ఇస్తోంది.

By Medi Samrat  Published on  29 Nov 2023 9:15 PM IST
మనోళ్లకు భారీగా వీసాలను ఇస్తున్న అమెరికా

అమెరికాలో చదువుకోవాలని అనుకునే భారత విద్యార్థులకు అమెరికా ప్రాధాన్యత ఇస్తోంది. 2022 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ మధ్యకాలంలో యూఎస్ ఎంబసీ, భారతదేశంలోని కాన్సులేట్‌లు రికార్డు స్థాయిలో 1,40,000 స్టూడెంట్ వీసాలను జారీ చేసింది. 2023 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా వలసేతర వీసాల సంఖ్య దాదాపు కోటి దాటినట్లు US స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. భారత ప్రభుత్వం సూచనల మేరకు వీసా అపాయింట్మెంట్ వెయిటింగ్ టైంను తగ్గించడానికి అమెరికా చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది సైతం భారత్ నుంచి వస్తున్న డిమాండ్ ఆధారంగా వీసాల జారీ ప్రక్రియ కొనసాగుతుందని యూఎస్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జూలీ స్టఫ్ట్ తెలిపారు. గతేడాది రికార్డు స్థాయిలో భారత విద్యార్థులకు వీసాలు జారీ చేయడాన్ని గర్వంగా భావిస్తున్నానన్నారు. భారతీయులను తాము ప్రత్యేకంగా చూస్తామని.. ప్రస్తుతం అమెరికా వీసాలు అత్యధికంగా పొందిన దేశంగా భారత్ నిలిచిందని అన్నారు.

హెచ్‌-1బీ వీసా రెన్యూవల్ విషయంలో కూడా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని కేటగిరీల హెచ్‌-1బీ వీసాలను అమెరికాలో ఉండే రెన్యువల్‌ చేసుకునేలా ఓ పైలట్‌ ప్రోగ్రామ్‌ ను డిసెంబరులో ప్రారంభించనుంది. మూడు నెలల పాటు ఈ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంటుందని జూలీ స్టఫ్‌ వెల్లడించారు. తొలుత 20వేల మందికి ఈ పైలట్‌ ప్రోగ్రామ్‌ కింద వీసా రెన్యువల్‌ చేయనున్నారు.

Next Story