తాలిబన్లకు షాక్ ఇచ్చిన ఆఫ్ఘన్ దళాలు
US strikes Taliban targets in show of force in Afghanistan. ఆఫ్ఘనిస్థాన్ నుండి దళాలు వెనక్కు వెళ్ళిపోతూ ఉన్నాయి. దీంతో తాలిబన్లు
By Medi Samrat Published on 24 July 2021 12:12 PM GMT
ఆఫ్ఘనిస్థాన్ నుండి దళాలు వెనక్కు వెళ్ళిపోతూ ఉన్నాయి. దీంతో తాలిబన్లు పెద్ద ఎత్తున ఆఫ్ఘన్ భూభాగాన్ని సొంతం చేసుకున్నామని ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా ఆఫ్ఘన్ దళాలు ఊహించని విధంగా తాలిబన్లకు షాక్ ఇచ్చింది. తాలిబన్ల చర్యలను నిశితంగా పరిశీలిస్తోన్న ఆఫ్ఘన్ దళాలు అదును చూసి ఒక్కసారిగా దాడి చేయడంతో 30 మందికిపైగా తాలిబన్లు హతమయ్యారు. మరో 17 మంది ఉగ్రవాదులకు తీవ్రగాయాలయ్యాయి. తాలిబన్లపై వైమానిక దాడులు చేయడంతో వారు హతమయ్యారని ఆఫ్ఘన్ అధికారులు ప్రకటించారు.
హతమైన తాలిబన్లలో 19 మంది షిబెర్ఘాన్ శివారులోని ముర్ఘాబ్, హాసన్ తాబ్బిన్ గ్రామాల్లో జరిపిన దాడుల్లో మరణించారని వివరించారు. మిగతావారు లష్కర్ ఘాహ్ శివారులో చనిపోయినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలో ఇద్దరు ఆఫ్ఘనిస్థానేతర ఉగ్రవాదులు ఉన్నారని ఆఫ్ఘన్ అధికారులు చెప్పారు. దాడుల వలన ఉగ్రవాదుల వాహనాలు, రెండు బంకర్లు, పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి ధ్వంసం అయ్యాయి.
తాలిబన్లపై పోరాటం సాగిస్తున్న ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వ దళాలకు మద్దతుగా తాము గగనతల దాడులు నిర్వహించినట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. అయితే, ఈ దాడుల వివరాలను తెలిపేందుకు నిరాకరించింది. ఆ ప్రాంతంలోని సెంట్రల్ కమాండ్ జనరల్ కెన్నెత్ ఫ్రాంక్ మెకంజీ ఆదేశాల మేరకే ఇవి జరిగాయనీ, అఫ్గాన్ బలగాలకు మద్దతుగా ఇలాంటి మున్ముందు కూడా దాడులు కొనసాగుతాయని పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. 20 రోజుల్లో సుమారు 7 డ్రోన్ దాడులు జరిగినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి.