అమెరికా-రష్యా దేశాల మధ్య సయోధ్య కుదిరే అవకాశం కనిపిస్తోంది. అధ్యక్షులు జో బైడెన్, పుతిన్ త్వరలోనే సమావేశం అవుతారంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్-రష్యా సరిహద్దుల్లో రష్యా సైన్యాన్ని మోహరించినంత మాత్రాన పుతిన్‌తో సమావేశమవ్వాలన్న తన ఉద్దేశంలో మార్పు ఉండదని బైడెన్ గతంలోనే అన్నారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల విషయంలో ముందడుగు పడుతుందనే నమ్మకం ఉందని కూడా అతను ఇటీవల మీడియాకు బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారిద్దరి భేటీపై తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. జూన్ 16న జెనీవాలో వారు భేటీ కానున్నట్లు సమాచారం.
ఈ భేటీ వార్తలను శ్వేతసౌధం కూడా ధ్రువీకరించింది. ఇరు దేశాల సంబంధాలపై బైడెన్, పుతిన్ పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ తెలిపారు. కాగా, ఉక్రెయిన్-రష్యా సరిహద్దుల్లో రష్యా తన సైన్యాన్ని మోహరించడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఉక్రెయిన్ అంశంతో పాటు మానవ హక్కుల ఉల్లంఘన, సైబర్ భద్రత వంటివాటిపై రష్యా, అమెరికా మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. సరిహద్దులో ఇంతకుముందు పుతిన్ దళాలు ఇంకా ఎక్కువగా ఉండేవి. ఆయన ఇప్పుడు దళాలను ఉపసంహరించుకున్నారు. అక్కడ ఇంకా రష్యా దళాలు ఉన్నాయి, అయితే ఓ నెల క్రితం ఉన్న దాని కన్నా తక్కువ దళాలు ఉన్నాయి అని జో బైడెన్ గతం లోనే పేర్కొన్నారు. ఇవి ఏవీ ఇరు దేశాల అధ్యక్షుల మధ్య భేటీకి ఆటంకం కాబోవని ఇటీవలే అమెరికా తెలిపింది.