ఓ వైపు ఆహార కొరత.. మరో వైపు అమెరికాకు కూడా వార్నింగ్
US Has Wrong Expectation For Dialogue. అమెరికా-ఉత్తర కొరియా దేశాల మధ్య చర్చల గురించి ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాయి.
By Medi Samrat Published on 22 Jun 2021 9:35 AM GMTఅమెరికా-ఉత్తర కొరియా దేశాల మధ్య చర్చల గురించి ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాయి. గతంలో పలుమార్లు ఇరు దేశాలు భేటీ అయినప్పటికీ పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది. మరోసారి ఈ రెండు దేశాలు చర్చలు కొనసాగిస్తాయని ఊహాగానాలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. వీటిని ఒక్క మాటలో ఉత్తర కొరియా లీడర్ కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ కొట్టి పడేశారు. అమెరికాతో మళ్లీ చర్చలు జరిపే ప్రసక్తే లేదని, చర్చల కోసం ఆ దేశం కలలు కంటోందని కిమ్ యో జోంగ్ మండిపడ్డారు.
అమెరికాతో చర్చలు జరిగే పని కాదని.. ఈ మేరకు ఉత్తర కొరియా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉత్తర కొరియా అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణి కార్యక్రమాలను వదులుకునేలా దౌత్యపర చర్యలు సహా అన్ని ప్రాక్టికల్ చర్యలకు సిద్ధమని ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. గత వారం జరిగిన సమావేశంలో అమెరికాతో చర్చలు, పోరాటం.. రెండింటికీ సిద్ధంగా ఉండాలని కిమ్ జోంగ్ ఉన్ తన అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ అది ఎంత వరకు ముందుకెళ్తుందో వేచి చూడాలన్నారు. ఉత్తర కొరియా పీఠ భూభాగంలో పూర్తిగా డీమిలిటరైజేషన్ జరగాలని ఆ దిశగా ఆ దేశ అణు కార్యక్రమం ఉండాలని అధ్యక్షుడు జోబైడెన్ భావిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా సూత్రప్రాయంగా చర్చలకు సిద్దమన్నట్టు సంకేతాలిస్తున్నారని జేక్ వెల్లడించారు.
ఇప్పుడు ఆయన వ్యాఖ్యలకు యో జోంగ్బదులిస్తూ అమెరికా ఏవేవో ఊహించుకుంటోందని.. అమెరికా అంచనాలన్నీ తప్పేనన్నారు. ఆ ఊహల్లోనే ఉంటే పెద్ద అసంతృప్తిలో మునిగిపోవాల్సి వస్తుందని కౌంటర్ వేశారు.
మరో వైపు ఉత్తర కొరియా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు అంగీకరించింది. ఆ దేశ వ్యవసాయ రంగం కుదేలైనట్లు తెలుస్తోంది. దేశంలో పరిస్థితులపై అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడుతూ ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షోభ నివారణకు ఆహార ఉత్పత్తులను గణనీయంగా పెంచే మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్ ఆంక్షలు మరికొంతకాలం కొనసాగుతాయని, వాటికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు కిమ్ పిలుపునిచ్చారు. కరోనాతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతుంటే ఉత్తర కొరియా మాత్రం తమ దేశంలో ఒక్క కేసు కూడా నమోదుకాలేదని చెబుతోంది. ఏడాదిన్నరగా సరిహద్దులను మూసివేయడంతో పాటు కఠిన లాక్‌డౌన్ ఆంక్షలను అమలు చేస్తోంది. గతేడాది అక్కడ సంభవించిన తుఫాన్లు, వరదలతో ఆహారోత్పత్తి దెబ్బతింది. ఆంక్షలు, ప్రకృతి వైపరిత్యాల కారణంగా ఉత్తర కొరియా లక్షల టన్నుల ఆహార కొరతను ఎదుర్కోనుందని దక్షిణ కొరియాకు చెందిన కొరియన్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఇటీవల వెల్లడించింది. ఉత్తర కొరియాలో ఒక బ్లాక్ టీ ప్యాకెట్ ధర రూ.5 వేలు, కాఫీ ప్యాకెట్ ధర రూ.7 వేలు, కిలో అరటిపండ్ల ధర 3వేలకు పైనే (45డాలర్లు). ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఉత్తర కొరియా దాదాపు 8 లక్షల 60 వేల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆహార విభాగం (FAO) అంచనా వేసింది.