కరోనా మహమ్మరిని అదుపులోకి తెచ్చేందుకు ట్రంప్ సర్కార్ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందుబాగంగా ఫైజర్, మోడెర్నా టీకాలను అనుమతి ఇచ్చి.. వాటిని ప్రజలకు అందిస్తోంది. ఈ క్రమంలోనే నెలల తరబడి అలుపెరగకుండా కష్టపడిన వైద్య సిబ్బందికి ముందుగా కరోనా టీకాలు అందజేస్తున్నారు. అయితే మోడర్నా వ్యాక్సిన్ తీసుకున్న ఒక వైద్యుడిలో అలర్జీ లక్షణాలు కనిపించాయి. అంతేకాదు అతని గుండె కూడా వేగంగా కొట్టుకున్నట్లు ఆ దేశ ప్రముఖ పత్రిక నూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.
బోస్టన్ మెడికల్ సెంటర్‌కు చెందిన జెరియాట్రిక్ ఆంకాలజీ వైద్యుడు హొస్సీన్ సదర్జాదేహ్ మోడెర్నా టీకాను డిసెంబర్ 24న వేయించుకున్నారు. టీకా తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే తనకు తీవ్ర ప్రతిస్పందనలు కలిగాయని ఆ డాక్టర్ తెలిపారు. అలర్జీ లక్షణాలతో పాటు కళ్లు తిరిగినట్లు, గుండె వేగంగా కొట్టుకున్నట్లు అనిపించిందని చెప్పారు. మోడెర్నా టీకా దేశవ్యాప్తంగా పంపిణీ ప్రారంభమైన తరువాత వెలుగులోకి వచ్చిన సీరియస్ కేసు ఇది.
దీనిపై బోస్టన్ మెడికల్ సెంటర్ ఒక ప్రకటన విడుదల చేసింది. 'సదరు వైద్యుడికి వచ్చిన అలర్జీకి సంబంధించి వెంటనే చికిత్స చేయించుకున్నారు. ఆయన్ని ఎమర్జెన్సీ విభాగానికి తరలించి అనారోగ్యానికి గల కారణాలను విశ్లేషించాం. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు' అని తెలిపింది.