ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంక్ కు ఊహించని షాక్

US blocks Taliban access to Afghan central bank assets. ఆఫ్ఘనిస్తాన్ ను సొంతం చేసుకున్న తాలిబాన్లు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు

By Medi Samrat  Published on  20 Aug 2021 11:52 AM GMT
ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంక్ కు ఊహించని షాక్

ఆఫ్ఘనిస్తాన్ ను సొంతం చేసుకున్న తాలిబాన్లు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లను చేస్తూ వెళుతున్నారు. అయితే తాలిబాన్ నేతల తీరుపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఎప్పుడు ఎటువంటి చర్యలకు పాల్పడుతారోనని ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంకుకు ఊహించని షాక్ తగిలింది.

తమ దేశంలోని బ్యాంకుల్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నిధులపై అమెరికా ఆంక్షలు విధించింది. దాదాపు 9.5 బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులను స్తంభింపజేస్తున్నట్టు తెలుస్తోంది. తాలిబన్ల చేతిలో నిధులు దుర్వినియోగం అవుతాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్‌ బ్యాంకులో ఉన్న డబ్బు తాలిబన్ల నేతృత్వంలోని ప్రభుత్వం యాక్సిస్‌ చేయకుండా స్తంభింపజేసినట్టు అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికాలో ఏ సెంట్రల్‌ బ్యాంకులో ఉన్న ఆస్తులూ తాలిబన్లకు అందుబాటులో ఉంచకుండా చర్యలు తీసుకున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్‌ బ్యాంకు (ద ఆఫ్ఘన్‌ బ్యాంక్‌)కు న్యూయార్క్‌ ఫెడరల్‌ రిజర్వు బ్యాంకు, అమెరికాలోని ఆర్థిక సంస్థల్లో దాదాపు 9.5బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు సమాచారం. తాలిబన్లు కాబుల్‌ నగరాన్ని ఆదివారం స్వాధీనం చేసుకున్నప్పటి నుంచే అమెరికా బ్యాంకుల్లోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ నిధులను స్తంభింపజేశారు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ జనెత్‌ యెల్లెన్‌, ఆ కార్యాలయంలోని విదేశీ ఆస్తుల నియంత్రణ సిబ్బంది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ ఖాతాలను స్తంభింపజేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. తాలిబన్‌ ప్రభుత్వం డబ్బును యాక్సిస్‌ చేయకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా అమెరికా నుంచి కాబుల్‌కు నగదు రవాణా కూడా నిలిచిపోయింది.


Next Story