ఇంటర్‌నేషనల్ స్పేస్ సెంటర్ నుండి నలుగురు వ్యోమగాములు సోమవారం ఉదయం 4 గంటలకు భూమిపైకి చేరుకోనున్నారు. అయితే అక్కడి నుండి తిరుగు పయనం అవుతున్న సమయంలో వీరికి ఊహించని సమస్య ఎదురైంది. వ్యోమగాములను తీసుకెళ్లిన డ్రాగన్ క్యాప్సూల్‌లో ఉండే బాత్‌రూమ్‌లో టాయిలెట్ గొట్టం ఊడి మూత్రం అంతా క్యాప్సూల్స్‌లో అడుగు భాగాన పడింది. దీన్ని తాత్కాలికంగా వ్యోమగాములు పరిష్కరించినప్పటికీ.. అది పూర్తిగా పనికిరాని పరిస్థితిలో ఉంది. దీంతో వ్యోమగాములు భూమిపైకి వచ్చే 20 గంటల ప్రయాణంలో వారు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్ 6 నెలల కిందట నలుగురు వ్యోమగాములను ఇంటర్‌నేషనల్ స్పేస్ సెంటర్‌కు పంపింది. ఆ తర్వాత అక్కడ అనేక పరిశోధనల తర్వాత వ్యోమగాములు భూమిపై రాబోతున్నారు.
బాత్‌రూమ్ లేకపోవడంతో వ్యోమగాములు అబ్జార్బెంట్ అండర్‌గార్మెంట్స్ (డైపర్లు) వాడేందుకు సిద్ధమయ్యారు. నలుగురు వ్యోమగాములు మెక్ ఆర్థర్ అనే మహిళా వ్యోమగామి కూడా ఉన్నారు. ఈ సమస్యపై మెక్ ఆర్థర్ మాట్లాడారు. స్పేస్ ప్రయాణం అనేది అనేక సవాళ్లతో కూడుకున్నదని.. దీన్ని తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఇది కొంచెం ఇబ్బందే అయినప్పటికీ.. పెద్ద సమస్య మాత్రం కాదని ఆమె అన్నారు. క్యాప్సూల్ భద్రతపై ఏ మాత్రం రాజీ పడలేదని వ్యోమగాములు చెప్పారు. వ్యోమగాములు మెక్‌ఆర్థర్, థామస్ పెస్కెట్, షేన్ కింబ్రో, అకిహికో హోషిడే సోమవారం భూమి పైకి చేరుకోనున్నారు. కాలిఫోర్నియా కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 10 గంటలకు వీరు ఇంటర్ నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరుతారు.