బంధీలను వెంటనే విడిచిపెట్టండి : ఐక్యరాజ్యసమితి
హమాస్ ఉద్రవాదుల ఆధీనం లోని బంధీలను తక్షణమే బేషరతుగా విడిచిపెట్టాలని ఐరాస చీఫ్ ఆంటోనియా గుటెరస్ కోరారు.
By Medi Samrat Published on 16 Oct 2023 8:49 PM ISTహమాస్ ఉద్రవాదుల ఆధీనం లోని బంధీలను తక్షణమే బేషరతుగా విడిచిపెట్టాలని ఐరాస చీఫ్ ఆంటోనియా గుటెరస్ కోరారు. ఇజ్రాయెల్ కూడా గాజా వాసుల కోసం సాయాన్ని తరలించేందుకు సహకరించాలని కోరారు. గాజాలో నీరు, విద్యుత్, నిత్యావసరాల నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయని ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఐరాసకు చెందిన ఆహారం, నీరు, ఆహారేతర వస్తువులు, ఔషధాల నిల్వలు, ఈజిప్ట్, జోర్డాన్, వెస్ట్‌బ్యాంక్, ఇజ్రాయెల్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిని కొన్నిగంటల్లోనే గాజాకు తరలించవచ్చని తెలిపారు. వీటిని గాజాలో నిస్వార్థంగా పనిచేస్తున్న ఐరాస సిబ్బందికి, ఎన్‌జీవోలకు అందిస్తారని, వారు గాజా మొత్తానికి అందిస్తారని తెలిపారు. సరఫరాలకు ఆటంకం లేకుండా చూడటం కీలకమని తెలిపారు.
డబ్లుహెచ్‌వో డైరెక్టర్ టెడ్రోస్ అథనామ్ మాట్లాడుతూ.. హమాస్ దాడులు అతి క్రూరమైనవి. ప్రతి ఒక్కరూ ఈ దాడుల్ని ఖండించాల్సిందేనని అన్నారు. బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ ప్రజలను హమాస్ వెంటనే విడిచిపెట్టాలని కోరారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల అమాయక పాలస్తీనా ప్రజలు, చిన్నారులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని, లక్షల మంది ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 199 మందిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్నారని ఇజ్రాయెల్ సైన్యం సోమవారం తెలిపింది. మొదట 155 మందిని హమాస్ ఉగ్రవాదులు పట్టుకున్నారని.. ఆ సంఖ్య 199 మందికి చేరిందని ఇజ్రాయెల్ చెబుతోంది.