రష్యాపై డ్రోన్ల‌తో విరుచుకుప‌డిన‌ ఉక్రెయిన్

ఉక్రెయిన్ మంగళవారం మాస్కోపై డ్రోన్ల‌తో విరుచుకుప‌డింది. 144 డ్రోన్లతో ఉక్రెయిన్ జ‌రిపిన‌ దాడిలో డజన్ల కొద్దీ భవనాలు ధ్వంసమయ్యాయి

By Medi Samrat  Published on  10 Sep 2024 3:15 PM GMT
రష్యాపై డ్రోన్ల‌తో విరుచుకుప‌డిన‌ ఉక్రెయిన్

ఉక్రెయిన్ మంగళవారం మాస్కోపై డ్రోన్ల‌తో విరుచుకుప‌డింది. 144 డ్రోన్లతో ఉక్రెయిన్ జ‌రిపిన‌ దాడిలో డజన్ల కొద్దీ భవనాలు ధ్వంసమయ్యాయి. దాడి కారణంగా రష్యా మాస్కో విమానాశ్రయాల నుండి 50 విమానాలను మళ్లించవలసి వచ్చింది. రష్యా మాస్కోలో 20 ఉక్రేనియన్ డ్రోన్‌లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. 124 డ్రోన్‌లను ఎనిమిది ఇతర ప్రాంతాలలో ఉప‌యోగించిన‌ట్లు నివేదిక‌లు వెల్ల‌డించాయి. ఈ ఘ‌ట‌న‌లో మాస్కో సమీపంలో ఒక మహిళ మరణించింది. అనేకమంది గాయపడ్డారు. దీనికి ప్రతిగా రష్యా కూడా 46 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడి చేసింది. ఉక్రేనియన్ దాడి కారణంగా మాస్కోలోని నాలుగు విమానాశ్రయాలలో మూడింటిని ఆరు గంటలపాటు మూసివేశారు. దీంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నివాస ప్రాంతాల‌పై ఉక్రేనియన్ దాడి చేయ‌డంతో మాస్కోలోని ఎత్తైన భవనాల నుండి మంటలు ఎగసిపడ్డాయి. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. రాత్రిపూట ఏ సైన్యం పౌరులపై ఇలా దాడి చేయదు. వారు మాకు శత్రువులని.. వారిపై సైనిక చర్యను కూడా కొనసాగిస్తామన్నారు.

రష్యా రాత్రిపూట 46 డ్రోన్లపై దాడి చేసి.. వాటిలో 38 ధ్వంసం చేసిందని ఉక్రెయిన్ తెలిపింది. మాస్కో ప్రాంతీయ గవర్నర్ ఆండ్రీ వోరోబయోవ్ మాట్లాడుతూ.. ఈ దాడిలో 46 ఏళ్ల మహిళ మృతి చెందిందని.. రామెన్‌స్కోయ్‌లో మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని చెప్పారు. పేలుడు శబ్ధంతో మేల్కొన్నామని స్థానికులు తెలిపారు.

ఇరాన్ నుంచి రష్యా స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను కొనుగోలు చేసిందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆరోపించారు. వారు వాటిని ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నార‌ని అన్నారు. ఇది యూరోపియన్ భద్రతకు పెద్ద ముప్పు. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ కూడా దీనిపై విమర్శలు గుప్పించాయి. ఇరాన్‌పై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నామన్నారు.

Next Story