రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 115 మంది ఉక్రెయిన్ చిన్నారులు మరణించారని ఉక్రెయిన్ పార్లమెంట్ తెలిపింది. రష్యా ప్రారంభించిన యుద్ధంలో 115 మంది పిల్లలు బలి అయ్యారు. 140 మందికి పైగా యువ ఉక్రేనియన్లు గాయపడ్డారు. ఇది కేవలం సంఖ్య కాదు.. వందలాది ఉక్రేనియన్ కుటుంబాల విచ్ఛిన్నమైన విధి అని అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది.
ఇదిలావుంటే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాల్గవ వారంలోకి ప్రవేశించింది. ఈ నేఫథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రష్యాకు భయంకరమైన హెచ్చరికను జారీ చేశారు. యుద్ధం యొక్క తీవ్రత.. దేశంలో రాబోయే తరాలు చవిచూస్తాయని చెప్పారు. ద్వైపాక్షిక చర్చలకు కట్టుబడి ఉక్రెయిన్‌పై దాడిని ఆపాలని రష్యాకు పిలుపునిచ్చారు.
రష్యా తన హైపర్‌సోనిక్ క్షిపణులు.. పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఇవానో-ఫ్రాంకివ్స్క్ ప్రాంతంలో క్షిపణులు, విమాన మందుగుండు సామగ్రి గల ఓ పెద్ద భూగర్భ డిపోను నాశనం చేశాయని పేర్కొంది. ఇదిలావుండగా.. రష్యా దళాలు చుట్టుముట్టిన ఉక్రేయిన్ నగరాలలో చిక్కుకున్న ప్రజలను చేరుకోవడానికి సహాయక సంస్థలు కష్టపడుతున్నాయని ఐక్యరాజ్యసమితి యొక్క ప్రపంచ ఆహార విభాగం తెలిపింది.