రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను హస్తగతం చేసుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఓ ఆఫర్ ఇచ్చింది. ఉక్రెయిన్ నుంచి అతడిని మరో దేశానికి సురక్షితంగా తరలిస్తామని చెప్పింది. అయితే.. ఈ ఆఫర్‌ను జెలెన్‌స్కీ తిరస్కరించినట్లు ఉక్రెయిన్ మీడియా వెల్లడించింది. 'ఇక్కడ యుద్ధం జరుగుతోంది. నాకు ఆయుధాలు కావాలి. పారిపోవడానికి సాయం కాదు' అని జెలెస్కీ గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది.
రష్యా దాడి తరువాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీబంకర్‌లోకి వెళ్లారు. అయితే.. తాజాగా ఆయన కీవ్ వీధుల్లో తిరుగుతున్న ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఎట్టి పరిస్థితుల్లో రాజధానిని పోగొట్టుకోమని తెలిపారు. తాను ఉక్రెయిన్ బలగాలను లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. అవన్ని అవాస్తవాలని కొట్టిపారేశారు. తాను ప్రస్తుతం కీవ్‌లోనే ఉన్నానని.. ఎట్టి పరిస్థితుల్లో ఆయుధాలను వీడే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌ను కాపాడుకుంటామని పునరుద్ఘాటించారు.
పోరాటంలో వందలాది మంది శత్రుసైనికులను హతమార్చినట్లు జెలెన్ స్కీ తెలిపారు. ఉక్రెయిన్ సైన్యం కూడా కొంతమంది హీరోలను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. కిండర్ గార్డెన్ సహా ఉక్రెయిన్ నివాస భవనసముదాయాలపై రష్యా బహుళ రాకెట్ వ్యవస్థలను ప్రయోగిస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే దాదాపు 3500 మంది రష్యన్ బలగాలను హతమార్చినట్టు ఉక్రెయిన్ చెబుతుండగా.. రష్యా దీన్ని దృవీకరించడం లేదు.