కన్న బిడ్డలను విసిరేసిన మహిళలు.. కంటతడి పెట్టిన నాటో సైనికులు
UK Soldiers Cried As Women Threw Babies Over Wires At Kabul Airport. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ను తాలిబాన్లు హస్తగతం చేసుకున్న తర్వాత
By Medi Samrat Published on 20 Aug 2021 2:55 PM ISTఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ను తాలిబాన్లు హస్తగతం చేసుకున్న తర్వాత ఆ దేశ ప్రజల్లో ఎక్కడ లేని ఆందోళన మొదలైంది. తాలిబాన్లు ఏమి చేస్తారో.. ఎవరిని హింసిస్తారో అని భయాందోళనలకు గురైన వాళ్లు పాస్ పోర్టులను పట్టుకుని ఎయిర్ పోర్టులకు చేరుకున్నారు. ఏదైనా విమానం ఎక్కితే చాలు.. వేరే ప్రాంతానికి వెళ్లి బ్రతికేయొచ్చని అనుకున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. విమానాలకు అతుక్కున్న ప్రజలకు సంబంధించిన వీడియోలను కూడా చూశాం..! విమానాన్ని పట్టుకుని ఎలాగైనా దేశం దాటేయాలని భావించిన వాళ్లు కూడా ఉన్నారు. అలా చేసి ప్రాణాలు కూడా కోల్పోయారు.
ఆఫ్ఘనిస్తాన్ మహిళలు తమ పిల్లలను కాపాడుకోడానికి చాలా ప్రయత్నాలను చేస్తూ వస్తున్నారు. కాబూల్ విమానాశ్రయం చుట్టూ పెట్టిన కంచెల పైనుంచి విమానాశ్రయంలోకి విసిరేస్తున్నారు. తమ పిల్లలను కాపాడి తీసుకెళ్లండంటూ అమెరికా, బ్రిటన్ దేశాల సైన్యానికి వేడుకుంటూ ఉన్నారు. వాళ్లొచ్చేస్తున్నారు, కాపాడండంటూ వారు పెట్టిన ఆర్తనాదాలు సైన్యానికే కన్నీరు తెప్పిస్తున్నాయి. మహిళలు తమ పిల్లలను కంచె మీది నుంచి విసిరేసి తమ వారిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని చూసి తమ సైనికులు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారని బ్రిటన్ సీనియర్ ఆర్మీ అధికారి చెప్పారు. కొందరు పిల్లలు ఆ ఇనుప ముళ్ల కంచెల్లోనే చిక్కుకుపోయి చాలా ఇబ్బందులు పడ్డారు.
పిల్లలను తీసుకొని కాబూల్ విమానాశ్రయం గేట్ దగ్గర వారి తల్లులు వేచి చూడడం అందరినీ కలిచివేసింది. వారిని బెదరగొట్టేందుకు తాలిబన్లు కాల్పులు జరిపారు. తాలిబన్ల కాల్పుల్లో ఆస్ట్రేలియా సైన్యానికి చెందిన ఓ మాజీ ఇంటర్ ప్రిటర్ కాలికి గాయమైంది. ఆస్ట్రేలియా సైన్యం తరలింపుల సందర్భంగా కాబూల్ విమానాశ్రయం గేట్ దగ్గర నిలబడగా కాల్చారంటూ ఆ వ్యక్తి చెప్పాడు. మరో వైపు ప్రజలను దేశం విడిచిపెట్టి వెళ్లకుండా తాలిబాన్లు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. తాము అండగా ఉంటామని తాలిబాన్ నేతలు ఆఫ్ఘన్ ప్రజలకు చెబుతూ వస్తున్నారు.