శ్రీలంకలో ఆహార, ఆర్థిక సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం శ్రీలంకలో ఒక కోడిగుడ్డు రూ.35 కాగా, కిలో చికెన్ ధర రూ.1000 పలుకుతోంది. కిలో ఉల్లిగడ్డలు రూ.200 కాగా, పాలపొడి రూ.1,945కి చేరింది. లీటర్ పెట్రోల్ రూ.283, లీటర్ డీజిల్ రూ.220గా ఉంది. డాలర్ తో శ్రీలంక కరెన్సీ విలువ రూ.270కి చేరింది. ఆర్థిక సంక్షోభం మరింత ముదిరిన నేపథ్యంలో శ్రీలంకలో 90 శాతం హోటళ్లు మూతపడ్డాయి. దేశంలో ధరల పెరుగుదలపై శ్రీలంక ప్రజలు నిరసన గళం వినిపిస్తున్నారు. శ్రీలంకలో 1990 సంక్షోభం కంటే దారుణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
శ్రీలంకలోని పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్‌ల వెలుపల క్యూలలో వేచి ఉన్న ఇద్దరు 70 ఏళ్ల వృద్ధులు మరణించారని అధికారులు ఆదివారం నాడు తెలిపారు. చారిత్రాత్మక విదేశీ రిజర్వ్ సంక్షోభంతో శ్రీలంక తీవ్ర ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతోంది. శనివారం సెంట్రల్ డిస్ట్రిక్ట్ కాండీ, కొలంబో సబర్బ్‌లో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు కొలంబో పోలీసులు తెలిపారు. మృతులిద్దరూ ఆరు గంటలకు పైగా క్యూలో వేచి ఉన్నారు. తీవ్రమైన వేడి కారణంగా సంభవించే అలసట మరణాలకు ప్రాథమిక కారణమని భావిస్తున్నారు.
సుదీర్ఘ విద్యుత్ కోతలను అధిగమించడానికి అనేక గృహాలు డీజిల్‌తో నడిచే జనరేటర్‌లను ఆపరేట్ చేయడంతో డీజిల్‌కు డిమాండ్ పెరిగింది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆహారం, ఇతర నిత్యావసరాల కొరతను చూస్తోంది, ఈ ఏడాది జనవరిలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 25 శాతానికి చేరుకుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే కీలకమైన పర్యాటక రంగం కూడా మందగించింది.