ప్లే స్టేషన్స్ బహుమతిగా ఇస్తా.. వచ్చేయండన్నాడు..!
Twitch streamer’s giveaway draws huge crowds to Union Square in New York City. ప్రసిద్ధ ట్విచ్ స్ట్రీమర్ 'కై సెనాట్' చిక్కుల్లో పడ్డాడు.
By Medi Samrat Published on 5 Aug 2023 7:10 PM ISTప్రసిద్ధ ట్విచ్ స్ట్రీమర్ 'కై సెనాట్' చిక్కుల్లో పడ్డాడు. తన ఫాలోవర్లకు PS5(ప్లే స్టేషన్స్) ను బహుమతిగా ఇస్తానని చెప్పడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆ ప్రాంతానికి వచ్చేశారు. దీంతో శుక్రవారం న్యూయార్క్ నగరంలో గందరగోళం మొదలైంది. భారీగా పోలీసులు అక్కడికి వచ్చారు.. అల్లర్లను అదుపు చేయడానికి చాలా సమయమే పట్టింది. దీంతో ఈ ఘటనలకు కారణమైన అతడిని అరెస్టు చేశారు. 2,000 కంటే ఎక్కువ మంది ప్రజలు యూనియన్ స్క్వేర్ పార్క్‌కి తరలివచ్చారు. అక్కడ ఉచిత ప్లేస్టేషన్ 5 లను ఇస్తారని అనుకున్నారు. కానీ అది కాస్తా గొడవలకు దారి తీసింది. కై సెనాట్ పై చట్టవిరుద్ధమైన సమావేశాలు నిర్వహించాడని, ఇతర నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మొదలైన గొడవలు సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఏకంగా 65 మంది అరెస్టులు జరిగాయి. పోలీసు వాహనాలు, దుకాణాలకు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.
21 ఏళ్ల కై సెనాట్ అనే యూట్యూబర్ కు అమెరికాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అతను తన ఇన్ స్టాగ్రామ్ పేజిలో మన్ హటన్ యూనియన్ స్వ్కేర్ పార్క్ లో శుక్రవారం సాయంత్రం లైవ్ స్ట్రీమింగ్ ఈవెంట్ చేయనున్నట్లు పేర్కొన్నాడు. అభిమానులను నేరుగా కలుస్తానని, వారికి ప్లే స్టేషన్ 5 గేమ్ కన్సోల్స్ సహా పలు బహుమతులు ఇస్తానని ప్రకటించాడు. ఇది చూసిన అభిమానులు మన్ హటన్ పార్క్ కు వేలాదిగా తరలిరాగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొందరు అల్లర్లకు పాల్పడ్డారు. వీధుల్లో వాహనాలను అడ్డగించి, కార్ల అద్దాలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు దిగారు. ఈ అల్లర్లలో పోలీసు అధికారులు సహా పలువురు గాయపడ్డారు. దీంతో కై సెనాట్ పై పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.