By Medi Samrat Published on 31 July 2021 10:34 AM GMT
వైద్యరంగంలో సంచలనం నమోదైంది. ఇజ్రాయెల్‌లోని ఆష్‌డోడ్ పట్టణంలోని ఆస్సుటా మెడికల్ సెంటర్‌లో అప్పుడే పుట్టిన ఓ ఆడశిశువు.. తల్లి గర్భంలో ఉండగానే గర్భం దాల్చి వైద్యులను ఆశ్చర్యకితులను చేసింది. 'ది యూఎస్ సన్' కథనం ప్రకారం.. ప్రసవ సమయానికి ముందు గర్భిణికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు జరిపిన వైద్యులు.. గర్భంలోని ఆడశిశువు పొట్టభాగం సాధారణంగా ఉండాల్సిన ఎత్తుకన్నా ఎక్కువగా ఉండటంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. దీంతో పుట్టిన అనంతరం చిన్నారికి వైద్యులు ఆల్ట్రాసౌండ్, ఎక్స్‌రే పరీక్షలు జరిపారు. అప్పుడు ఆ శిశువు కడుపులో ఒకటికన్నా ఎక్కువ పిండాలు(Embryo ఇన్సైడ్ Stomach) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
అంతేకాదు.. ఆ పిండాలలో మనిషి రూపంలో గుండె, ఎముకలు కూడా అభివృద్ధి చెందాయంట. దీంతో వెంటనే నియోనాటాలజీ విభాగం డైరెక్టర్ ఓమర్ గ్లోబస్ నేతృత్వంలో చిన్నారికి సర్జరీ చేసి పిండాలను బయటకు తీసి వైద్యం అందిస్తున్నారు. శిశువు కడుపులో ఉన్న పిండాలు ఇప్పుడిప్పుడే రూపాలను సంతరించుకుంటున్నాయని తెలిపారు. తల్లి గర్భంలో కవల పిండాలు తయారవుతున్న సమయంలో.. కొంత వృద్ధి చెందిన పిండంలోకి మరో పిండం(foetus in fetu) పోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయని అన్నారు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా.. లక్షల మందిలో ఒకరిలో కనిపిస్తాయని వెల్లడించారు.