'యుద్ధం' ఆగేనా.? పుతిన్‌-జెలెన్‌స్కీ 'భేటీ' ఎప్పుడంటే..?

మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు చేపట్టిన చొరవ సోమవారం ఒక అడుగు ముందుకు వేసింది.

By Medi Samrat
Published on : 19 Aug 2025 8:34 AM IST

యుద్ధం ఆగేనా.? పుతిన్‌-జెలెన్‌స్కీ భేటీ ఎప్పుడంటే..?

మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు చేపట్టిన చొరవ సోమవారం ఒక అడుగు ముందుకు వేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సోమవారం రాత్రి భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు వైట్‌హౌస్‌కు చేరుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో దాదాపు 45 నిమిషాల పాటు మాట్లాడారు. చర్చలలో జెలెన్స్కీ ఉక్రెయిన్‌లో శాంతి నెల‌కొల్పాల‌నే తన కోరికను వ్యక్తం చేశారు. దీని కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యక్ష చర్చలు అవసరమని పిలుపునిచ్చారు.

పుతిన్‌కు కూడా యుద్ధం అక్కర్లేదని అంటున్నార‌ని.. కాబట్టి ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రంప్ అన్నారు. అన్నీ సవ్యంగా సాగితే త్రైపాక్షిక (పుతిన్-ట్రంప్-జెలెన్స్కీ) చర్చలు జరుగుతాయి. గ‌త అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను యుద్ధానికి ప్రత్యక్షంగా బాధ్యుడయ్యాడ‌ని.. అతడు అవినీతిపరుడు అని ట్రంప్ ఆరోపించారు. ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్, జెలెన్స్కీ మధ్య చర్చలు జరుగుతుండగా.. మరో గదిలో యూరప్‌లోని పెద్ద పెద్ద నేతలంతా ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచారు. అధ్యక్షుడు ట్రంప్ అర్ధరాత్రి తర్వాత ఈ నాయకులతో మాట్లాడారు.

ట్రంప్, జెలెన్స్కీల మధ్య చర్చలు ప్రారంభం కాకముందే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, ఫిన్నిష్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే వైట్ హౌస్ చేరుకున్నారు. ఈ నాయకులు చర్చల అంతటా ఒక గదిలో కూర్చుని ట్రంప్, జెలెన్స్కీల మధ్య చర్చల గురించి సమాచారాన్ని పొందుతూనే ఉన్నారు.

చర్చల సందర్భంగా యూరప్ ప్రతిపాదనకు అనుగుణంగా ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు ఇస్తామని ట్రంప్ ఈ నాయకులకు హామీ ఇచ్చారు. జెలెన్స్కీతో త్రైపాక్షిక సమావేశం తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ వెయ్యి మందికి పైగా ఉక్రేనియన్ ఖైదీలను వెంటనే విడుదల చేస్తారని తాను ఆశిస్తున్నానని ట్రంప్ అన్నారు. ఫిబ్రవరి 28న ఓవల్ హౌస్‌లో ట్రంప్, జెలెన్స్కీ మధ్య జరిగిన వాడి వేడి సమావేశంలా కాకుండా.. ఈసారి అంతా సాధారణంగానే ఉంది. చర్చల సందర్భంగా ఇద్దరు నాయకులు చాలాసార్లు నవ్వుతూ క‌నిపించారు. అయితే.. జెలెన్స్కీ-పుతిన్ 2 వారాల్లో కలుసుకుంటారని జర్మన్ ఛాన్సలర్ ధృవీకరించారు

సమావేశం తర్వాత జెలెన్స్కీ మాట్లాడుతూ.. ట్రంప్‌తో తాను చాలా మంచి సంభాషణ జరిపానని అన్నారు. రష్యాను ఆపాలని, అందుకు తనకు అమెరికా, యూరోపియన్ దేశాలు అవసరమని ఆయన అన్నారు. ఒక నివేదిక ప్రకారం, ఉక్రెయిన్ కూడా అమెరికా నుండి $100 బిలియన్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేసే ఒప్పందానికి అంగీకరించింది.

Next Story