'భారత్‌పై 100 శాతం సుంకం విధించండి'.. G7 దేశాలపై ట్రంప్ ఒత్తిడి..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ క్షణం ఏం చెబుతారో, మరుసటి క్షణం ఏం చేస్తారో అంతుప‌ట్ట‌దు.

By -  Medi Samrat
Published on : 12 Sept 2025 10:29 AM IST

భారత్‌పై 100 శాతం సుంకం విధించండి.. G7 దేశాలపై ట్రంప్ ఒత్తిడి..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ క్షణం ఏం చెబుతారో, మరుసటి క్షణం ఏం చేస్తారో అంతుప‌ట్ట‌దు. ఒకవైపు ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధిస్తూనే.. మరోవైపు భారత్‌ను తన నిజమైన మిత్రుడుగా పేర్కొంటున్నారు. ఇలాంటి చర్యల వ‌ల్ల‌ అమెరికా ఎప్పుడూ లేని అపఖ్యాతిని మూట‌గ‌ట్టుకుంది.

ఇప్పుడు మరోసారి అమెరికా అలాంటి ప‌నే చేసింది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. భారత్‌, చైనాపై 100 శాతం వరకు సుంకం విధించాలని అమెరికా G7 దేశాలను కోరిన‌ట్లు తెలుస్తుంది. దీనికి ముందు అమెరికా యూరోపియన్ యూనియన్‌పై కూడా అదే విధంగా ఒత్తిడి తెచ్చింది.

శుక్రవారం ప్రధాన G-7 ఆర్థిక వ్యవస్థల ఆర్థిక మంత్రులు వీడియో కాల్‌లో సమావేశం కానున్నారు. ఇందులో డొనాల్డ్ ట్రంప్ ద్వారా ఉక్రెయిన్‌లో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా సిద్ధం చేసిన కొత్త ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. రష్యా చమురు కొనుగోలుచేస్తున్న‌ భారత్‌, చైనాలపై భారీ సుంకాలు విధించేలా జి-7 దేశాలపై అమెరికా ఒత్తిడి తెస్తుందని ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం ఉన్న వ్యక్తులు పేర్కొన్నారు. ఈ రుసుము ఎంత అనేదానిపై స్పష్టమైన సమాచారం వెల్లడి కాలేదు.. అయితే 50 నుండి 100 శాతం మధ్య సుంకం విధించాలని అమెరికా ప్రతిపాదించినట్లు చెబుతున్నారు.

అంతకుముందు యుఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాట్లాడుతూ.. 'మా EU మిత్రదేశాలు తమ దేశంలో యుద్ధాన్ని ముగించాలని తీవ్రంగా భావిస్తే.. అర్థవంతమైన టారిఫ్‌లు విధించడంలో మాతో కలిసి ఉండవలసి ఉంటుందని మేము వారికి స్పష్టం చేసాము' అని అన్నారు. G-7 గురించి ప్రస్తావిస్తూ.. మా G7 భాగస్వాములు కూడా మాతో కలిసి అడుగులు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దీన్ని బ‌ట్టి ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు.

గత నెలలో అమెరికా భారత్‌పై సుంకాలను 50 శాతానికి పెంచింది. కాగా.. ఐరోపా సమాఖ్య తన గ్యాస్‌లో ఐదవ వంతు రష్యా నుండి కొనుగోలు చేస్తుంది.

Next Story