బాదుడే బాదుడు..చైనాపై టారిఫ్‌లను 245 శాతానికి పెంచేసిన అమెరికా
చైనా దిగుమతి వస్తువులపై సుంకాన్ని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ 145 శాతం నుంచి 245 శాతానికి పెంచేసింది.
By Knakam Karthik
బాదుడే బాదుడు..చైనాపై టారిఫ్‌లను 245 శాతానికి పెంచేసిన అమెరికా
అమెరికా, చైనా మధ్య బిజినెస్ బ్యాటిల్ మరింత ముదురుతోంది. చైనా దిగుమతి వస్తువులపై సుంకాన్ని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ 145 శాతం నుంచి 245 శాతానికి పెంచేసింది. తమ వస్తువులపై ప్రతీకారంగా చైనా దిగుమతి సుంకాలు పెంచిన నేపథ్యంలో ఈ చర్యకు దిగినట్లు అధికార భవనం వైట్‌హౌస్ వెల్లడించింది. అమెరికా దిగుమతి సుంకాన్ని పెంచిన నేపథ్యంలో.. రెండు రోజుల క్రితం చైనా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా సంస్థ బోయింగ్ ఉత్పత్తి చేస్తున్న విమానాలను కొనుగోలు చేయవద్దని తమ దేశ విమానయాన సంస్థలను చైనా ఆదేశించిన విషయం తెలిసిందే. బోయింగ్ సంస్థ నుంచి విడిభాగాలు కూడా కొనుగోలు చేయరాదు అని చైనా తమ దేశ ఎయిర్‌లైన్స్ సంస్థలను ఆదేశించింది. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే అమెరికా ప్రతీకార చర్యకు పాల్పడింది. చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాన్ని ఏకంగా 245 శాతానికి పెంచినట్లు వైట్ హౌస్ వెల్లడించింది.
దీంతో చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు అమెరికాలో విపరీతంగా పెరగనున్నాయి. ఫలితంగా అమెరికన్లు చైనా వస్తువులను కొనుగోలు చేయడం ఆపేయడంతో ఆ దేశ కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయి. కాగా, యూఎస్ వస్తువులపై చైనా 125 శాతం సుంకాన్ని విధిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, ట్రంప్ సుంకాల దెబ్బకు కొన్ని దేశాలు అమెరికాతో చర్చలకు సిద్ధమవుతున్నాయి. దాదాపు 75 దేశాలు కొత్త వాణిజ్య ఒప్పందాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాయని వైట్ హౌస్ పేర్కొంది. ఫలితంగా, ఈ చర్చల నేపథ్యంలో అధిక సుంకాలను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు శ్వేతసౌధం చెప్పింది. అయితే చైనా దిగుమతులపై మాత్రం అధిక సుంకాలు కొనసాగుతాయని వెల్లడించింది.