భారత్ సిద్ధంగా ఉంది.. జీరో టారీఫ్‌లపై మళ్లీ అవే వ్యాఖ్యలు చేసిన ట్రంప్
అమెరికా వస్తువులపై సుంకాన్ని 100 శాతం(జీరో టారీఫ్) తగ్గించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు
By Medi Samrat
అమెరికా వస్తువులపై సుంకాన్ని 100 శాతం(జీరో టారీఫ్) తగ్గించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. త్వరలో న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు ట్రంప్ తెలిపారు. ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి తాను "హడావిడి"లో లేనని ట్రంప్ అన్నారు.
అమెరికా వస్తువులపై విధించే అన్ని సుంకాలను భారత్ ఎత్తివేస్తోందని అమెరికా అధ్యక్షుడు పదే పదే చెబుతున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ “ఏ వాణిజ్య ఒప్పందమైనా పరస్పరం ప్రయోజనకరంగా ఉండాలన్నారు. వాణిజ్య ఒప్పందాన్ని సుస్థిరం చేసుకునేందుకు భారత్, అమెరికా చర్చలు జరుపుతున్నాయి. భారత్, అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని జైశంకర్ గురువారం తెలిపారు. "ఇవి సంక్లిష్టమైన చర్చలు. అన్నీ ఖరారు అయ్యే వరకు ఏదీ అంతిమంగా ఉండదు. ఏదైనా వాణిజ్య ఒప్పందం పరస్పరం ప్రయోజనకరంగా ఉండాలి; అది రెండు దేశాలకు పని చేయాలి. వాణిజ్య ఒప్పందం నుండి మనం ఆశించేది అదే" అని ఆయన అన్నారు.
ఇంతలో ట్రంప్ మరోసారి భారతదేశాన్ని "ప్రపంచంలో అత్యధిక సుంకాలు ఉన్న దేశాలలో ఒకటి" అని అభివర్ణించారు. అందరూ మాతో ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారన్నారు. దక్షిణ కొరియా ఒప్పందం చేసుకోవాలనుకుంటోంది, కానీ నేను అందరితో ఒప్పందం చేసుకోను. నేను పరిమితులను సెట్ చేయబోతున్నాను. నేను మరికొన్ని రాజీలు చేస్తాను. నేను అందరితో రాజీ పడలేను.. కాబట్టి అదరూ కలవలేరు. "నా దగ్గర 150 దేశాలు ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారని అన్నారు.
ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం కోసం చర్చల పురోగతిని అంచనా వేయడానికి వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం వాషింగ్టన్‌లో ఉన్నారు. అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్, అమెరికా వాణిజ్య ప్రతినిధి (యుఎస్‌టిఆర్) జేమీసన్ గ్రీర్‌లతో ఆయన చర్చలు జరపనున్నారు.