ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) గురువారం దక్షిణ గాజాలో జూలై 13న వైమానిక దాడిలో హమాస్ టాప్ మిలిటరీ కమాండర్ మహ్మద్ డీఫ్‌ను అంతమొందించినట్లు ప్రకటించింది. హమాస్ టాప్ మిలిటరీ కమాండర్ మరణాన్ని ధృవీకరిస్తూ.. జూలై 13న హమాస్ కమాండర్ మొహమ్మద్ డీఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిపిన వైమానిక దాడిలో అతడు మరణించినట్లు తమకు ఇంటెలిజెన్స్ ధృవీకరణ లభించిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ మేరకు "ఇప్పుడు మేం ధృవీకరించాం.. మహ్మద్ డీఫ్ అంతమయ్యాడు" అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ X లో రాసింది.
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ స్పందిస్తూ.. హమాస్‌ను అణచివేసే ప్రక్రియలో ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. మొహమ్మద్ దీఫ్‌ను యోవ్ గల్లంట్.. గాజాకు అతడు ఒసామా బిన్ లాడెన్‌గా అభివర్ణించాడు. డీఫ్ హత్య "హమాస్ విచ్ఛిన్నమవుతుందనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది" అని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ రక్షణ స్థాపనకై "హమాస్ టెర్రరిస్టులను, నేరస్థులను" వెంబడిస్తామని ఆయన అన్నారు. "ఈ లక్ష్యం నెరవేరే వరకు మేము విశ్రమించము," అన్నారాయన. ఇదిలావుంటే.. ఈ దాడుల్లో కనీసం 90 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.