కరేబియన్ దీవుల్లోని సింట్ మార్టెన్ అనే దేశంలో కోతులన్నిటినీ చంపేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. వెర్వెట్ జాతి కోతులను మొత్తం దేశంలో నుండి నిర్మూలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే మూడేళ్లలో కనీసం 450 వెర్వెట్ కోతులను పట్టుకుని చంపేయాలని ప్రభుత్వం యోచిస్తోందని ది గార్డియన్ నివేదించింది. వెర్వెట్ కోతులు తమ పంటలపై దాడి చేసి వారి జీవనోపాధిని నాశనం చేస్తున్నాయని గత కొన్నేళ్లుగా రైతులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ముప్పు గురించి రైతులు ప్రభుత్వానికి పదే పదే ఫిర్యాదు చేసిన తర్వాత ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
వెర్వెట్ కోతులు ఆ ద్వీపానికి చెందినవి కావు. అంతేకాకుండా వాటిని వేటాడే జంతువులు కూడా లేవు. వాటి జనాభాను అదుపులో ఉంచడం చాలా కష్టమవుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. వెర్వెట్ కోతులు తెల్లటి బొచ్చుతో, బూడిద-గోధుమ శరీర రంగుతో, ముఖం నల్లటి రంగును కలిగి ఉంటాయి, ఈ కోతులు దక్షిణ, తూర్పు ఆఫ్రికాకు చెందినవి. అయితే ఇలా చంపేయడం జంతు ప్రేమికులకు అసలు నచ్చడం లేదు.