దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ వేరియంట్ ఇప్పటికే దేశాలకు విస్తరించినట్లు పలు నివేదికలు చెబుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్ని అప్రమత్తం అయ్యాయి. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పలు దేశాలు దక్షిణాఫ్రికా నుండి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. అలాగే చాలా దేశాల్లో కరోనా కట్టడి కోసం చర్మలను వేగవంతం చేశాయి. ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ట్రెడ్రోస్ అథనామ్ మాట్లాడారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై అతిగా స్పందించొద్దని సూచించారు. ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని తెలిపారు. తమ పౌరులను కాపాడుకోవాలని దేశాలు భావించడాన్ని తాము అర్థం చేసుకున్నామని టెడ్రోస్ అన్నారు. అయితే తమకు ఒమిక్రాన్ వేరియంట్‌పై ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రాలేదని, వేరియంట్ తీవ్రత ఎంత అనేది తెలుసుకుంటున్నామని చెప్పారు.
ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు ఏ మేరకు ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోగలవు అనే దానిపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉందన్న.. ఆయన ఇప్పటి వరకు మరణాలు నమోదు కాలేదని తెలిపారు. అయితే కొన్ని దేశాలు వైరస్ కట్టడి కోసం కఠిన ఆంక్షలు విధిస్తున్నాయని, దీని వల్ల వైరస్‌కు అడ్డుకట్ట వేయలేమని తెలిపారు. కఠిన ఆంక్షల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీంతో పరిస్థితులు మరింత దిగజారుతాయని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ టెడ్రోస్ అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ గురించి పూర్తిగా తెలియక ముందే దక్షిణాఫ్రికాపై ఆంక్షలు విధించవద్దని ప్రపంచ దేశాలకు టెడ్రోస్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఒమిక్రాన్ వేరియంట్‌పై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్న దక్షిణాఫ్రికా, బోట్సావానా దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇతర దేశాలు దక్షిణాఫ్రికాను శిక్షించడం ఆందోళనకరమని టెడ్రోస్ అన్నారు.