మయన్మార్ సైన్యం గుప్పిట్లో.. భారత్ ఆందోళన
The end of Myanmar's limited experiment with democracy. మయన్మార్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఒక సంవత్సరం పాటూ తాము
By Medi Samrat Published on 1 Feb 2021 6:39 PM ISTమయన్మార్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఒక సంవత్సరం పాటూ తాము దేశాన్ని చేతుల్లోకి తీసుకుంటూ ఉన్నామని సైన్యం తెలిపింది. సైన్యం తిరుగుబాటుతో ప్రపంచ దేశాలన్నీ షాక్ కు గురయ్యాయి. ఒక సంవత్సరం పాటూ స్టేట్ ఎమర్జెన్సీని విధిస్తున్నామని మయన్మార్ సైన్యం తెలిపింది. ఆంగ్ సాంగ్ సూకీని, అలాగే పలువురు అధికారులను మయన్మార్ సైన్యం అదుపులోకి తీసుకుంది. మిలిటరీ కి చెందిన ఛానల్ లో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. దేశంలో స్థిరత్వాన్ని తీసుకుని రావడానికి ఈ పని చేశామని మయన్మార్ సైన్యం చెప్పుకొచ్చింది. ప్రజా నేత, నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) అధినేత్రి అంగ్ సాన్ సూకీ సహా పలువురు సీనియర్ నేతలను ఈ తెల్లవారుజామున సైనికులు అరెస్ట్ చేశారు. దేశంలో ఇటీవల ఎన్నికలు జరుగగా, ఈ ఎన్నికలు మోసపూరితంగా జరిగాయని సైన్యాధికారులు ఆరోపించారు. 77 ఏళ్ల ఆంగ్ సాంగ్ సూకీ పార్టీ 476 సీట్లలో 396 సీట్లను సొంతం చేసుకుంది. అయినా కూడా ఆ దేశ మిలిటరీ ఈ ఎన్నికలను ఒప్పుకోలేదు. ఊహించని విధంగా సోమవారం నాడు దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆంగ్ సాంగ్ సూకీని అదుపులోకి తీసుకుని హౌస్ అరెస్ట్ చేస్తున్నామని మిలిటరీ తెలిపింది. ఆంగ్ సాంగ్ సూకీని, ఇతర అధికారులను విడుదల చేయాలంటూ ఆస్ట్రేలియా ఇప్పటికే మయన్మార్ మిలిటరీ అధికారులకు హెచ్చరికలను జారీ చేసింది.
సూకీ సహా పలువురు ఇతర నేతలను అదుపులోకి తీసుకుని జైళ్లకు తరలించారని ఎన్ఎల్డీ అధికార ప్రతినిధి మో నూన్ట్ 'రాయిటర్స్' వార్తా సంస్థకు తెలిపారు. ఈ ఉదయం నుంచి మయన్మార్ రాజధాని న్యాపిటావ్ కు ఫోన్ కనెక్షన్లు మొత్తం కట్ అయ్యాయి. మో న్యూన్ట్ ఫోన్ సైతం ఫోన్ కు అందుబాటులో లేకుండా పోయారు. దేశంలో జరుగుతున్న పరిణామాలపై సైన్యం ఇంతవరకూ స్పందించలేదు. యాంగాన్ సహా పలు నగరాలను సైన్యం తన అధీనంలోకి తీసుకుంది. అధికార ఎమ్ఆర్టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి. మయన్మార్ లో జరిగుతున్న సైనిక తిరుగుబాటుపై అమెరికా ఘాటుగా స్పందించింది. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే ఏ విషయాన్నైనా తాము సీరియస్ గా తీసుకుంటామని, ఎన్నికైన ప్రభుత్వం పాలన కొనసాగించేందుకు సైన్యం సహకరించాలని కోరింది.
మయన్మార్ లో సైనిక తిరుగుబాటు పట్ల భారత్ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని వ్యాఖ్యానించింది. మయన్మార్ లో ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించాలని పొరుగున ఉన్న దేశంగా భారత్ కోరుకుంటోందని, ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తున్నామని తెలిపింది.