భారత ఆస్తులపై దాడులు చేయండి.. ఐఎస్ఐ ఆదేశం..!
Target India built assets in Afghanistan.ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా దళాల ఉపసంహరణ తరువాత తాలిబన్లు రెచ్చిపోతున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 19 July 2021 2:39 AM GMTఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా దళాల ఉపసంహరణ తరువాత తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే దేశంలోని దాదాపు 80 శాతం గ్రామాలను వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అష్రఫ్ ఘనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు జరుపుతున్నారు. తాలిబన్లకు మద్దతుగా ఇప్పటికే చాలా మంది పాకిస్థాన్ ఫైటర్లు వాళ్లతో చేతులు కలిపారు. తాలిబన్లు ఇప్పుడు పాకిస్థాన్ చేతిలో కీలుబొమ్మల్లా మారిపోయారు. ఇప్పుడు వారందరి లక్ష్యం ఒకటే.. ఆఫ్ఘనిస్థాన్‌లోని భారత ఆస్తులపై దాడులు చేయడమే.
ఈ మేరకు ఆదేశాలు అందాయని అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే పాకిస్థాన్ నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లోకి సుమారు 10 వేల మంది ఫైటర్లు చొరబడినట్లు సమాచారం. వీళ్లలో కొంతమంది ఎప్పటి నుంచో ఆఫ్ఘనిస్థాన్‌లోనే ఉంటూ.. అమెరికా దళాలకు వ్యతిరేకంగా ఫైట్ చేశారు. 2001లో ఆఫ్ఘనిస్థాన్‌పై తాలిబన్లు పట్టు కోల్పోయినప్పటి నుంచీ ఇప్పటి వరకూ భారత్ ఆ దేశంలో 300 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. జారంజ్, డెలారామ్ మధ్య ఉన్న 218 కి.మీ. రోడ్డు, ఇండియాఆఫ్ఘనిస్థాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ (సల్మా డ్యామ్), ఆఫ్ఘన్ పార్లమెంట్ బిల్డింగ్‌లాంటివి ఇండియా అక్కడ నిర్మించింది.
గతంలో ఉగ్రవాదుల దాడుల్లో తీవ్రంగా విధ్వంసానికి గురైన ఆప్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో భారత్ ఎంతగానో సాయపడింది. పార్లమెంట్ సహా అనేక పరిపాలన భవనాలు, ప్రాజెక్టులు నిర్మించింది. ఇంకా పలు నిర్మాణాలు చేపడుతోంది. అయితే.. ఇప్పుడు ఈ నిర్మాణాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలంటూ తాలిబన్ ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఐఎస్ఐ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే అక్కడ పని చేస్తున్న భారత వర్కర్లను దేశం వదిలి వచ్చేయాల్సిందిగా భారత ప్రభుత్వం సూచించింది.