ఉక్రెయిన్ పారామిలిటరీ దళంలో చేరిన తమిళనాడు విద్యార్థి.. భారత్ వచ్చేందుకు సిద్ధం.!
Tamil Nadu student who joined Ukrainian paramilitary force to fight Russia wants to return. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన విద్యార్థి రష్యాతో పోరాడేందుకు
By Medi Samrat Published on 13 March 2022 8:09 AM GMT
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన విద్యార్థి రష్యాతో పోరాడేందుకు ఉక్రేనియన్ పారామిలటరీ దళాల్లో చేరి స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు అతని తండ్రి తెలిపారు. ఆర్. సాయినిఖేష్ అనే విద్యార్థి ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లోని నేషనల్ ఏరోస్పేస్ యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అతను ఫిబ్రవరిలో వాలంటీర్లతో కూడిన పారామిలిటరీ యూనిట్ అయిన జార్జియన్ నేషనల్ లెజియన్‌లో చేరాడు. సాయి నిఖేష్ ఎత్తు కారణంగా భారత ఆర్మీలో చేరేందుకు రెండుసార్లు తిరస్కరించబడ్డాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. సాయినిఖేష్ తండ్రి రవిచంద్రన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుండి అధికారులు కుటుంబంతో టచ్‌లో ఉన్నారని.. త్వరలో తమ కుమారుడిని కనుగొని స్వదేశానికి తీసుకువస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మూడు రోజుల క్రితం కొడుకుతో మాట్లాడిన రవిచంద్రన్.. భారత్‌కు తిరిగి రావడానికి సాయినిఖేష్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ పరిణామం గురించి తెలిసిన ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. అతని తల్లిదండ్రులు సాయినిఖేష్‌ను భారతదేశానికి తిరిగి రావాలని కోరినప్పుడు అతను సరిగా స్పందించలేదు. యుద్ధం ప్రారంభమైనప్పుడు ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సాయినిఖేష్ సంప్రదించలేదని అధికారి తెలిపారు.
ఇదిలావుంటే.. రష్యన్ దళాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రేనియన్ ప్రభుత్వం విదేశీ కిరాయి సైనికులకు రోజుకు 2,000 అమెరికా డాలర్లను అందిస్తోందని తెలుస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొనడానికి అనుభవజ్ఞులైన సైనికులు కావాలని కోరుతూ పలు ప్రకటనలు చేసినట్లు ఈవెనింగ్ స్టాండర్డ్ నివేదించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో పోరాడేందుకు అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అభ్యర్థన మేరకు.. ఇంటర్నేషనల్ లెజియన్ ఆఫ్ ఉక్రెయిన్ టెరిటోరియల్ డిఫెన్స్‌ను ఏర్పాటు చేసింది. 52 దేశాల నుండి 20,000 మంది వాలంటీర్లు ఉక్రెయిన్ కోసం పోరాడటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా పేర్కొన్నారు.