అప్పుడే.. అమెరికా-బ్రిటన్ లకు తాలిబాన్ల హెచ్చరికలు

Taliban warns of 'consequences' if U.S. extends evacuation. సైన్యాల ఉపసంహరణ కోసం అదనపు సమయం కోరితే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి

By Medi Samrat  Published on  23 Aug 2021 7:37 PM IST
అప్పుడే.. అమెరికా-బ్రిటన్ లకు తాలిబాన్ల హెచ్చరికలు

సైన్యాల ఉపసంహరణ కోసం అదనపు సమయం కోరితే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అగ్ర‌రాజ్యాలు అమెరికా, బ్రిటన్‌ను తాలిబన్లు హెచ్చరించారు. ఆగస్టు 31 డెడ్‌లైన్ పొడిగించే అవకాశమే లేదని అన్నారు. ఇప్పటికే ఆగస్టు 31 నాటికి సైన్యాల ఉపసంహరణ పూర్తి చేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ఈ గడువును అమెరికాగానీ, బ్రిటన్ గానీ పొడిగించదలిస్తే... అవసరం లేకున్నా వారు అఫ్ఘానిస్థాన్‌లో మరికొంత కాలం ఉండేందుకు నిర్ణయించినట్టు భావించాల్సి ఉంటుంది. వారు తమ నిర్ణయాల పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహెల్ షాహీన్ తాజాగా హెచ్చరించారు. సైన్యాల ఉపసంహరణకు మరికొంత సమయం పట్టొచ్చంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో తాలిబాన్లు తాజాగా హెచ్చరికలు చేశారు.


ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆగస్టు 31 నాటికి తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని అమెరికా ఇదివరకే నిర్దేశించుకున్నా అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా బలగాలను పూర్తిస్థాయిలో తరలించడం ఆలస్యం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అమెరికా సేనలను మరికొంత సమయం పాటు ఆఫ్ఘనిస్తాన్ లోనే ఉంచాలని.. ఇలాంటి వాటిపై చర్చించేందుకు జీ7 దేశాలు అత్యవసరంగా సమావేశం కావాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సూచించారు. ఇదిలాఉంటే, అఫ్గాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించే ఆపరేషన్‌ కొనసాగుతోంది. నిత్యం రెండు విమానాల ద్వారా భారతీయులను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో అక్కడ నెలకొన్న పరిస్థితులను భారత ప్రభుత్వం ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తోందని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ తెలిపారు.


Next Story