ఆప్ఘనిస్థాన్‌లోని చిట్టచివరి ప్రాంతం పంజ్‌షీర్ ప్రావిన్స్ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లింది. పంజ్‌షీర్ ప్రావిన్స్‌పై పట్టు సాధించేందుకు జరుగుతున్న పోరులో తాలిబన్లు పైచేయి సాధించారు. మొత్తం ప్రాంతమంతా వాళ్ల ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం తాలిబన్లు ఓ ప్రకటన చేశారు. అఫ్గనిస్తాన్‌లో చిట్టచివరి ప్రాంతాన్ని కైవసం చేసుకోవడంలో తాలిబన్లు సఫలమైనట్లు తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపాడు. పంజ్‌షీర్ ప్రావిన్సియల్ గవర్నర్ కార్యాలయంపై తాలిబన్లు జెండా ఎగరవేస్తున్న దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పంజ్‌షీర్ లోని కొంత భూభాగాన్ని ఆక్రమించామంటూ తాలిబన్లు ఇటీవల ప్రకటన చేసినప్పటికీ పంజ్‌షీర్ దళ సభ్యులు మాత్రం ఆ వార్తలను ఖండించారు. ఇప్పుడు పంజ్‌షీర్ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించడం గమనార్హం. ఇక ఈ పోరులో అహ్మద్ మసూద్ మేనల్లుడు అబ్దుల్ తో పాటు పలువురు ముఖ్యనేతలు మృతి చెందారని ప్రకటించారు. తాలిబన్ల దాడి నేపథ్యంలో ప్రతిఘటన బృందం నాయకుడు అహ్మద్ మసూద్, ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ వేరే సురక్షిత ప్రాంతానికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలావుంటే.. పంజ్‌షీర్ సాయుధ దళాల నేత అహ్మద్ మసూద్ పోరాటం ఆపివేసి, చర్చల కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆదివారం సాయంత్రం ప్రకటించాడు. మరోవైపు ఆయుధం పక్కనపెట్టే ప్రసక్తే లేదని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల తాజా ప్రకటన 'పంజ్‌షీర్ కైవసం' పై స్పందించేందుకు అహ్మద్ అందుబాటులో లేడు. అహ్మద్ మసూద్ పరారీలో ఉన్నట్లు లోకల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.