మహిళల నివాస భవనాల్లో కిటికీలపై నిషేధం.. డిక్రీ జారీ
ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌లు మహిళలకు సంబంధించి వింత ఆచారాలు, నియమాలు విధిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు.
By Medi Samrat Published on 30 Dec 2024 10:13 AM ISTఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌లు మహిళలకు సంబంధించి వింత ఆచారాలు, నియమాలు విధిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా తాలిబాన్ మహిళల కోసం వారు మరోసారి డిక్రీ జారీ చేశారు. మహిళలు ఉపయోగించే కిటికీలను తప్పనిసరిగా మూసివేయాలని.. నివాస భవనాలలో కిటికీల నిర్మాణాన్ని నిషేధిస్తూ తాలిబాన్ సుప్రీం నాయకుడు ఒక ఉత్తర్వు జారీ చేశాడు. ఇరుగుపొరుగు ఇళ్లలో, ప్రత్యేకించి మహిళలు నివాసముంటున్న నివాస భవనాల్లో కిటికీలను నిర్మించడాన్ని నిషేధిస్తూ తాలిబాన్ నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా ఆదేశాన్ని జారీ చేశారు.
"మహిళల గోప్యతకు భంగం కలగకుండ, వారి గౌరవానికి హాని కలగకుండా రక్షించడం" లక్ష్యంగా తాలిబాన్ ఆర్డర్.. ఇళ్ల యజమానులపై కఠినమైన పరిమితులను విధించింది. డిక్రీ ప్రకారం.. గృహాలను నిర్మించే వ్యక్తులు మహిళలు ఉంటున్న ఆస్తుల ప్రాంగణాలు లేదా నివాస స్థలాలకు ఎదురుగా కిటికీలను అమర్చకూడదు. ఇప్పటికే ఉన్న భవనాల్లో తాజా ఆదేశాలను ఉల్లంఘించే విధంగా కిటికీలు ఉంటే.. యజమాని గోడను నిర్మించుకోవడం లేదా తగిన కవరింగ్ చేసి ఆ పక్క చూడకుండా ఉండే విధంగా నిరోధించాలని డిక్రీ పేర్కొంది. ఈ మేరకు పురపాలక అధికారులు, ఇతర సంబంధిత ఏజెన్సీలను ఆదేశాలు అమలు చేయాలని ఉత్తర్వులలో ఆదేశించారు. కొత్త భవనాలలో ఇటువంటి కిటికీల నిర్మాణాన్ని నిరోధించడానికి.. ఆర్డర్‌ను కఠినంగా అమలు చేయడానికి వారికి ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఈ నియమాలు ముందస్తు నిర్మాణాలకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. అంటే ఆదేశాలకు ముందు నిర్మించిన నిర్మాణాలు కొత్త నియమాలకు అనుగుణంగా సవరించాలి.
2021లో అధికారం చేపట్టినప్పటి నుండి తాలిబాన్ మహిళలపై అనేక ఆంక్షలు విధించింది. వీటిలో ఇంటి నుంచి బయటకు వెళ్లి విద్య అభ్యసించడం, ఉద్యోగం చేయడం వంటి వాటిపై నిషేధం ఉంది. పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాలకు ప్రవేశాన్ని నిరోధించారు. అలాగే.. మహిళలు బహిరంగంగా పాడటం, కవితలు చదవడాన్ని నిషేధించింది. కొన్ని స్థానిక రేడియో, టెలివిజన్ స్టేషన్లు కూడా మహిళల గొంతులను ప్రసారం చేయడాన్ని నిలిపివేసాయి.ఈ నిర్ణయాలు మానవ హక్కుల సంఘాల నుండి విస్తృతమైన వ్యతిరేకతకు దారితీసింది. అయినా వెనక్కి తగ్గలేదు.