మేము మారిపోయాము.. మమ్మల్ని నమ్మండి ప్లీజ్ : తాలిబాన్
Taliban foreign minister asks world for mercy and compassion. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లు అధికారం చేపట్టారు. అయితే అధికారాన్ని కొనసాగించడం చాలా
By Medi Samrat Published on 15 Dec 2021 3:45 PM GMTఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లు అధికారం చేపట్టారు. అయితే అధికారాన్ని కొనసాగించడం చాలా కష్టమని తాలిబాన్ నేతలకు అర్థం అయిపోయింది. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన ఆఫ్ఘనిస్తాన్.. ప్రపంచ దేశాలు తమను ఆదుకోవాలని కోరుతూ ఉన్నాయి. చాలా మంది ఆఫ్ఘన్ ప్రజలు ఆకలి లేక అలమటిస్తూ ఉంటే.. పలు దేశాలు తమకు తోచినంత సహాయం చేస్తూ ఉన్నాయి. భారత్ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున గోధుమలను ఆఫ్ఘనిస్తాన్ కు తరలించింది. ఇక మేము మారిపోయాము.. మమ్మల్ని నమ్మండని తాలిబాన్ ప్రతినిధులు చెబుతూ ఉన్నారు. తమపై పై ఆర్థిక ఆంక్షలు విధించడం, దేశాన్ని అస్థిరపరచడం వల్ల ఎవరికీ ఒరిగేది లేదని తాలిబాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ అన్నారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం బలహీనంగా మారితే ఎవరికి లాభమని ప్రశ్నించారు. తమకు అన్ని దేశాలతో మంచి సంబంధాలే కావాలని .. అమెరికాతో తమకు సమస్యలేవీ లేవన్నారు. తమకు రావాల్సిన వెయ్యి కోట్ల డాలర్ల నిధులను ఫ్రీజ్ చేశారని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. అమెరికా పెద్ద దేశం. గొప్ప దేశం. అలాంటి దేశానికి ఓపిక, సహనం అవసరం. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఆఫ్ఘనిస్థాన్ లో విధాన రూపకల్పనకు పెద్ద మనసు చేసుకోవాలని.. వివాదాలన్నీ తొలగిపోయేలా ఆఫ్ఘనిస్థాన్ తో మంచి సంబంధాలు కొనసాగించాలని ముత్తాఖీ కోరారు.
ఒకప్పుడు తాలిబాన్లు అమ్మాయిల చదువు, ఉద్యోగ బాధ్యతలపై ఆంక్షలు విధించిన మాట వాస్తవమేనని, కానీ, తామిప్పుడు మారామని చెప్పారు. పాలన, రాజకీయ వ్యవహారాల్లో పురోగతి సాధించామన్నారు. రాబోయే రోజుల్లో మరింత అనుభవం సంపాదిస్తామని, దేశాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. కొత్త తాలిబన్ ప్రభుత్వంలో బాలికలు పాఠశాలలకు వెళ్తున్నారని, ప్రైవేటు స్కూళ్లు, యూనివర్సిటీలు నిరాటంకంగా నడుస్తున్నాయని తెలిపారు. 100 శాతం మహిళా ఉద్యోగులు డ్యూటీలకు వెళ్తున్నారని చెప్పారు. దేశంలో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను లక్ష్యంగా చేసుకోలేదని.. వారికి భద్రతనూ కల్పిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలోని ముఖ్య నేతలంతా కాబూల్ లో హాయిగా జీవిస్తున్నారని గుర్తు చేశారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదట్లో తాము తప్పులు చేసిన మాట వాస్తవమేనని, కానీ, ఇప్పుడు దేశ బాగు కోసం ఎన్నెన్నో సంస్కరణలను చేపడుతున్నామని అన్నారు.ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ ఉగ్రవాదులతో పోరాడేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం ఆఫ్ఘన్ లోని సగానికిపైగా జనాభా (2.3 కోట్ల మంది) ఆకలితో అలమటిస్తున్నారంటూ ఐక్యరాజ్యసమితి హంగర్ ఇండెక్స్ వెల్లడించింది. రాబోయే రోజుల్లో కరువు కూడా ఆఫ్ఘనిస్తాన్ పై తీవ్ర ప్రభావం చూపనుందని పలు నివేదికలు సూచిస్తూ ఉన్నాయి. తాము మారామని తాలిబాన్లు చెబుతున్నా కూడా పలు దేశాలు ఇంకా వారిపై అనుమానాలను వ్యక్తం చేస్తూనే ఉన్నాయి.