కాబూల్ చుట్టూ తాలిబన్లే..!
Taliban Enter Kabul Coming From All Sides Say Afghan Official. ఆఫ్ఘనిస్థాన్ లోని చాలా భాగాలను తమ చేతుల్లోకి తీసేసుకున్న తాలిబాన్లు ఇక రాజధాని
By Medi Samrat Published on 15 Aug 2021 3:45 PM IST
ఆఫ్ఘనిస్థాన్ లోని చాలా భాగాలను తమ చేతుల్లోకి తీసేసుకున్న తాలిబాన్లు ఇక రాజధాని కాబూల్ ను సింథమ్ చేసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. కాబూల్ నగరానికి అతి సమీపంలోకి వచ్చేసిన ఉగ్రవాదులు.. ఒక్కరోజులోనే నగరం లోపలికి చొచ్చుకొచ్చేశారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ ఉన్నతాధికారి వెల్లడించారు. నగరం నలుమూలల నుంచి తాలిబన్ ఉగ్రవాదులు చొరబడిపోతున్నారని.. నగరంలోని చాలా ప్రాంతాల్లో తుపాకుల మోత మోగుతోందని ఆఫ్ఘన్ అధ్యక్ష భవనం తన అధికారిక ట్విట్టర్ ఖాతా లో ట్వీట్ చేసింది.
అంతర్జాతీయ మిత్రులతో కలిసి తాలిబన్లను ఆఫ్ఘన్ సైన్యం నిరోధిస్తోందని, ప్రస్తుతం కాబూల్ సైన్యం నియంత్రణలోనే ఉందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దీంతో ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయినట్టేనని చెబుతున్నారు. అమెరికా తన రాయబారులను అక్కడి నుంచి హెలికాప్టర్ లో తరలించింది. వజీర్ అక్బర్ ఖాన్ జిల్లాలోని ఎంబసీ అధికారులను విమానాశ్రయానికి తీసుకెళ్లామని అమెరికా అధికారులు తెలిపారు. యూరోపియన్ యూనియన్ సిబ్బందిని కాబూల్ లోని అత్యంత సురక్షితమైన రహస్య ప్రాంతానికి తరలించామని నాటో అధికారి చెప్పారు. వీలైనంత త్వరగా అమెరికన్లను కాపాడి తీసుకొచ్చేందుకు 5 వేల మంది బలగాలను ఆఫ్ఘనిస్థాన్ కు పంపాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలిచ్చారు. 82వ ఎయిర్ బార్న్ కు చెందిన వెయ్యి మంది బలగాలను అదనంగా పంపిస్తున్నట్టు ఆ దేశ రక్షణ శాఖ అధికారి చెప్పారు. తమకూ ఎవరినీ చంపాలని లేదని, అయితే తాము మాత్రం కాల్పులను విరమించబోమని తాలిబన్ ప్రతినిధులు చెబుతూ ఉన్నారు.
ఆఫ్ఘన్ లో పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. తాలిబాన్ల దురాక్రమణపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బలప్రయోగం అంతర్యుద్ధానికి దారితీస్తుందని అన్నారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులన్నీ తాలిబాన్ల వశమయ్యాయి. టర్కీ, ఇరాన్ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. తాలిబాన్ల భయంతో దేశం వీడుతున్న ఆఫ్ఘన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాంతో సరిహద్దులు దాటి వస్తున్న శరణార్థులను అడ్డుకునేందుకు టర్కీ, ఇరాన్ చర్యలు తీసుకుంటున్నాయి.